Karumuri Nageshwara Rao: పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్ర బహిరంగ సభకు మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మేరుగ నాగార్జున, కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీలు నందిగాం సురేష్, సినీ నటుడు ఆలీ, శాసన మండలి చైర్మన్ కోయ్యే మోషెన్ రాజు, తదితరులు పాల్గొన్నారు. జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ప్రతిపక్ష నేతలు తలదించుకోవాలని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. కులాలు, మతాలు చూడకుండా ప్రతి ఒక్కరికీ సమ న్యాయం చేస్తున్న ఒకే ఒక్క నాయకుడు జగన్ అంటూ ఆయన పేర్కొన్నారు. పేదవాడికి జబ్బు చేస్తే ఆదుకోవాలని చంద్రబాబు ఎప్పుడు ఆలోచించలేదని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. పేదవాడికి చదువు, వైద్యం అందించిన ఘనత వైఎస్‌కు దక్కుతుందన్నారు. అబద్ధం – నిజానికి మధ్య యుద్ధంలో నిజాన్ని గెలిపించాలన్నారు.
Also Read: Pawan Kalyan: జనసేన, టీడీపీ సారధ్యంలో ‘గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది’.. పవన్ ట్వీట్
పేద విద్యార్థుల చదువు ఆగకూడదు, పేదలకు వైద్యం అందక చనిపోకుడదు అని ఆలోచించిన వ్యక్తి జగన్ అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. టీడీపీ, జనసేన కలసి మరోసారి ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని పని చేసే వ్యక్తి జగన్ అని.. తన సామాజిక వర్గానికి మాత్రమే న్యాయం చేయాలని చూసే వ్యక్తి చంద్రబాబు అని ఎంపీ నందిగాం సురేష్ పేర్కొన్నారు. పేదలను చులకన చేసి చిన్న చూపు చూసిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. రాష్ట్ర సంపద దోచిన వ్యక్తి చంద్రబాబు.. అదే రాష్ట్ర సంపద పేదల ఖాతాలో వేసిన వ్యక్తి జగన్ అంటూ వ్యాఖ్యానించారు. సామాజిక సాధికారిత అంటే గతంలో పార్టీలకు నినాదం , కానీ సాధికారితను జగన్ ఒక విధానంగా మార్చారని శాసన మండలి ఛైర్మన్ మోషేన్ రాజు పేర్కొన్నారు. అన్ని వర్గాలను అభివృద్ధి చేయాలనే తపన జగన్‌లో ఉందన్న ఆయన.. బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులకు రాజకీయంగా అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు.