ఓ డాక్టర్ నిర్లక్ష్యం ఇద్దరు శిశువుల ప్రాణం తీసింది. అప్పుడే పుట్టిన పిల్ల గురించి కాకుండా తన సౌకర్యం కోసం డాక్టర్ ఆలోచించడంతో కళ్లు తెరచి సరిగ్గా ప్రపంచాన్ని కూడా చూడని బిడ్డలు ప్రాణాలు కోల్పోయారు. ఓ డాక్టర్ ఏసీ వేసుకొని పడుకోవడంతో చలికి తట్టుకోలేక తెల్లారేసరికి నవజాత శిశువులు ఇద్దరు మరణించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని షామ్లి జిల్లాలో ఓ ప్రైవేట్ క్లినిక్‌లో చోటు చేసుకుంది.
Also Read: Urinate in Mouth: దారుణం.. మహిళను కిడ్నాప్ చేసి.. బట్టలిప్పి.. కొట్టి.. నోట్లో మూత్రం పోశారు
వివరాల్లోకి వెళ్తే శనివారం రాత్రి నిద్రపోయే ముందు డాక్టర్ నీతూ గదిలోని ఏసీని పెంచారు. ఆమె అక్కడే ఉన్న నవ జాత శిశువుల గురించి ఆలోచించలేదు. అయితే తెల్లారి చూసే సరికి ఇద్దరు నవజాత శిశవులు చనిపోయారు. శిశువులు శనివారం కైరానాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జన్మించారు. అయితే అదే రోజు వారినిషామ్లి జిల్లాలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి పంపించారు. అక్కడ చికిత్స కోసం వారిని ఫొటోథెరపీ యూనిట్‌కు పంపిచారు. అక్కడే డాక్టర్ నీతూ రాత్రంతా ఏసీ ఆన్ చేసి టెంపరేచర్ తక్కువలో పెట్టి నిద్రపోయారు.
ఉదయం తమ చిన్నారులను చూసేందుకు వెళ్లిన కుటుంబ సభ్యులకు వారు చనిపోయి కనిపించారు. దీంతో డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా తమ శిశువులు చనిపోయారని, ఏసీ వేయడం వల్ల చలికారణంగా వారు మరణించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డాక్టర్ నీతూను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనపై ఆరోగ్యశాఖ విచారణకు ఆదేశించింది. డాక్టర్ నీతూ దోషిగా తేలితే కఠిన చర్యలు తప్పవని అదనపు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అశ్వని శర్మ హెచ్చరించారు. ఇక ఆ డాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని నవజాత శిశువుల తల్లిదండ్రులు, బంధువులు, కుటుంబం సభ్యులు హాస్పటల్ వద్ద ఆందోళన చేపట్టారు.