మరోసారి తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ పాదాలు ఒక్కసారి కాదు వందసార్లైనా మొక్కుతామని అన్నారు. సీఎం కేసీఆర్ తనకు తండ్రి సమానులు అని, ఆయన పాదాలను తాకడం అదృష్టంగా భావిస్తున్నా అని అన్నారు శ్రీనివాస్. తెలంగాణకు మరో బాపూజీ సీఎం కేసీఆర్ అని.. భద్రాద్రి కొత్తగూడెం ప్రజల కోసం ఒక కొత్త వైద్య కళాశాలను ఏర్పాటు చేయడం సంతోషమన్నారు. కొత్తగూడెం పూర్తిగా వెనుకబడిన ప్రాంతమని ఇక్కడ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరానన్నారు. ఇక్కడ కాలేజీలు లేకపోవడం వల్ల 30 ఏళ్ల క్రితం ఎంబీబీఎస్ చేయడానికి తాను హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ దాకా వెళ్లాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు శ్రీనివాస్.
Also Read : Turkish Airstrikes: టర్కీ వైమానిక దాడులు.. సిరియా, ఇరాక్‌లో 89 కుర్దిష్ మిలిటెంట్ స్థావరాలు ధ్వంసం
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన 8 మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ మంగళవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల్లో మెడికల్ కాలేజీలను హైదరాబాద్ లోని ప్రగతి భవన్ నుంచి సీఎం కేసీఆర్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ క్లాసుల్ని కూడా వర్చువల్‌గానే ప్రారంభించారు కేసీఆర్. ప్రారంభోత్సవం తర్వాత కేసీఆర్ ను కలిసిన హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు.. తమ జిల్లా భద్రాద్రి కొత్తగూడెంకు మెడికల్ కాలేజీని అందజేసినందుకు పుష్పగుచ్చం ఇచ్చి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కాళ్లు మొక్కారు. కార్యక్రమం ముగించుకుని వెళ్తుండగా కూడా మరోసారి కాళ్ల మీద పడ్డారు. అయితే ఈ విషయం చర్చనీయాంశంగా మారడంతో నేడు ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ కార్యక్రమానికి హాజరైన నేపథ్యంలో పైవ్యాఖ్యలు చేశారు.