Turkish Airstrikes: టర్కీ యుద్ధ విమానాలు ఆదివారం ఉత్తర సిరియా, ఉత్తర ఇరాక్‌లోని కుర్దిష్ మిలిటెంట్ స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించి 89 లక్ష్యాలను ధ్వంసం చేశాయి. ఇస్తాంబుల్‌లో ఒక వారం క్రితం బాంబు దాడిలో ఆరుగురు మరణించగా.. దానికి ప్రతీకారంగా ఈ దాడులు నిర్వహించినట్లు టర్కీ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. చట్టవిరుద్ధమైన కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ (పీకేకే), సిరియన్ కుర్దిష్ వైపీజీ మిలీషియా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి.
నవంబర్ 13న ఇస్తాంబుల్‌లోని ఇస్తిక్‌లాల్ అవెన్యూలో జరిగిన పేలుళ్లకు కుర్దిష్ మిలిటెంట్లే కారణమని అంకారా ఆరోపించింది. దీని వల్ల ఆరుగురు మరణించగా.. 80 మందికి పైగా గాయపడ్డారు. రద్దీగా ఉండే పాదచారుల అవెన్యూపై ఏ సమూహం బాధ్యత వహించలేదు. పీకేకే, కుర్దిష్ నేతృత్వంలోని సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్ ప్రమేయాన్ని ఖండించారు. ఇరాక్‌లోని ఖండిల్, అసోస్, హకుర్క్.. సిరియాలోని కొబానీ, తాల్ రిఫాత్, సిజైర్, డెరిక్‌లలో దాడులు నిర్వహించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.ధ్వంసమైన 89 లక్ష్యాలలో షెల్టర్లు, సొరంగాలు, మందుగుండు సామగ్రి డిపోలు ఉన్నాయి. హతమైన వారిలో ఉగ్రవాద సంస్థ డైరెక్టర్లు అని పిలవబడేవారు ఉన్నారని టర్కీ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
టర్కీ దాడులు ధాన్యం గోతులు, పవర్ స్టేషన్, ఆసుపత్రితో సహా మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయని సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్(SDF) ప్రతినిధి ఒకరు తెలిపారు. జర్నలిస్టుతో సహా 11 మంది పౌరులు మరణించారని ఎస్‌డీఎఫ్ మీడియా సెంటర్ హెడ్ ఫర్హాద్ షమీ ట్విట్టర్‌లో తెలిపారు.దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఎస్‌డీఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. టర్కీ ఆక్రమిత దళాల ఈ దాడులకు ప్రతిస్పందన ఉంటుందని పేర్కొంది. ఉత్తర అలెప్పో, హసాకా సమీపంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆదివారం ఉదయం సిరియన్ ల్యాండ్‌పై టర్కిష్ దురాక్రమణలో అనేక మంది సైనికులు మరణించారని సిరియన్ సైనిక ప్రతినిధులు రాష్ట్ర మీడియా సనాకు తెలిపారు.
టర్కీ రక్షణ మంత్రి హులుసి అకర్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. అమాయక ప్రజలు, పరిసరాలకు నష్టం జరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఉగ్రవాదులు, ఉగ్రవాదులకు చెందిన నిర్మాణాలను మాత్రమే టర్కీ బలగాలు లక్ష్యంగా చేసుకున్నాయని అన్నారు. టర్కీ సాయుధ దళాల పంజా మరోసారి ఉగ్రవాదులపై మాత్రమే అని వెల్లడించారు. ఈ ఆపరేషన్‌ను “క్లా స్వోర్డ్” అని పిలిచారు. ఇరాక్‌లోని పీకేకీ మిలిటెంట్లకు వ్యతిరేకంగా సరిహద్దు ఆపరేషన్‌ను పూర్తి చేసిన తర్వాత ఉత్తర సిరియాలో లక్ష్యాలను వెంబడించాలని అంకారా యోచిస్తున్నట్లు టర్కీ అధికారి మంగళవారం తెలిపారు.
China: 6 నెలల తర్వాత చైనాలో తొలి కరోనా మరణం
వైపీజీ మిలీషియాకు వ్యతిరేకంగా ఉత్తర సిరియాలో టర్కీ ఇప్పటివరకు మూడు సార్లు దాడులు నిర్వహించింది. అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ గతంలో టర్కీ వైపీజీకి వ్యతిరేకంగా మరో ఆపరేషన్ నిర్వహించవచ్చని చెప్పారు. టర్కీ ఇటీవలి నెలల్లో సిరియాలో డ్రోన్ దాడులను కూడా పెంచింది. అనేక మంది కీలక ఎస్‌డీఎఫ్ ప్రతినిధులను హతమార్చింది. టర్కీ ఉత్తర ఇరాక్‌లో కూడా వైమానిక దాడులను నిర్వహిస్తోంది. పీకేకే 1984 నుంచి టర్కీకి వ్యతిరేకంగా తిరుగుబాటుకు నాయకత్వం వహించింది. దీనిని టర్కీ, యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్‌లు ఉగ్రవాద సంస్థగా పరిగణిస్తాయి. సిరియాలో ఇస్లామిక్ స్టేట్‌కు వ్యతిరేకంగా పోరాటంలో అమెరికా వైపీజీతో పొత్తు పెట్టుకుంది. ఇది నాటో మిత్రదేశమైన టర్కీతో చీలికకు కారణమైంది.