Pawan Kalyan: కాకినాడ జిల్లా గొల్లప్రోలు ముంపు ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించిన సంగతి తెలిసిందే. ఏలేరు వరద ముంపు కారణంగా గొల్లప్రోలులో నీట మునిగిన జగనన్న కాలనీ , పంట పొలాలను ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరిశీలించారు. ముఖ్యంగా ఏలేరుకు దిగువన గల సుద్దగడ్డవాగుకు వరద పోటెత్తడంతో స్థానిక కాలనీలు అన్నీ నీటిలో మునిగిపోయాయి. పడవలో వెళ్లి ముంపు ప్రాంతాలను పవన్ పరిశీలించారు. సుద్ధగడ్డ వాగు సమస్యకు ఇక్కడి ఎమ్మెల్యేగా పూర్తి స్థాయి పరిష్కారం చూపుతానని పవన్ కల్యాణ్ స్థానికులకు హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం జగనన్న కాలనీల పేరుతో చేసిన తప్పులకు ప్రజలు నష్టపోయారన్నారు. ఆ తప్పులను కూటమి ప్రభుత్వంలో మేము సరి చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఏలేరు రిజర్వాయర్ వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షించి తగు సూచనలు ఇస్తున్నామన్నారు. ప్రజల బాధలు స్వయంగా పరిశీలించేందుకే ఆరోగ్యం సరిగా లేకపోయినా క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చానని చెప్పారు. గత ప్రభుత్వంలో పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యం అయ్యే పరిస్థితి వచ్చిందని.. కష్టాల్లో ఉన్న పంచాయతీలను ఆదుకోవడం బాధ్యతగా తీసుకున్నానని పవన్ పేర్కొన్నారు.
Read Also: Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ‘వినాయకుడు’.. మీ అభిమానం సల్లగుండా!!
బుడమేరుకు సంబంధించిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా వంటి వ్యవస్థ కంటే ముందుగా ఆక్రమణలు చేసిన వారితో మాట్లాడాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. బుడమేరు ఆక్రమణలు చాలా మంది తెలిసో తెలియకో చేసిన వారు ఉన్నారని ఆయన అన్నారు. ఆక్రమణ స్థలం అని తెలియక కొన్నవారు కూడా ఉన్నారన్నారు. ముందుగా ఆక్రమణలు గుర్తించి అందరితో కలిసి కూర్చుని మాట్లాడి చర్యలు తీసుకుంటే మంచిది అన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని పవన్ చెప్పుకొచ్చారు. నదీ పరివాహక ప్రాంతాలు, వాగు పరివాహక ప్రాంతాల్లో కట్టడాలపై ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. అనుకోకుండా వచ్చిన భారీ వర్షాలతోనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రమంతటా ఈ వర్షాలున్నాయని పవన్ కల్యాణ్ వెల్లడించారు. వరద విపత్తు నుంచి కోలుకోవడానికి విజయవాడకు కాస్త సమయం పట్టొచ్చని.. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలలో కూడా వరదలు విపత్తులు వచ్చిన వేళ కోలుకోవడానికి సమయం పడుతుందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.