Aravind Kejriwal: కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్సుకి వ్యతిరేకంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మద్దతు కూడగడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన బుధవారం సీపీఐ జాతీయ నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ పోరాటానికి మద్దతుగా ఉంటామని సీపీఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా వెల్లడించారు. కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను తాము వ్యతిరేకిస్తున్నామని, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం లేదని రాజా మండిపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీ, పుదుచ్చేరిలో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయని.. ఢిల్లీ ప్రభుత్వానికి తాము అండగా ఉంటామన్నారు.
Read Also: Dogs Attack: ఐదేళ్ల బాలుడిపై వీధికుక్కల దాడి..
సీపీఐ పార్టీ ఢిల్లీ ప్రజల కోసం తమకు మద్దతు తెలపడం సంతోషకరమని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. సీఎం అయ్యాక మొదటిసారి డి. రాజాను కలిశానని.. ఆర్డినెన్స్ కేవలం ఢిల్లీ కోసమే కాదు.. అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుందని తెలిపారు. బీజేపీయేతర పార్టీలు ఎక్కడ ఉంటే అక్కడ ఇలాంటి ఆర్డినెన్స్ భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందని అన్నారు. కేంద్రం సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా పక్కన పెడుతుందని.. అధికారులను మార్చే అవకాశం, రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్రం దూరం చేస్తుందని కేజ్రీవాల్ మండిపడ్డారు.
Read Also: TSRTC: టీ-24 టికెట్ ధరలు పెంపు.. ధరలు జూన్ 16 నుంచి అమలు
మరోవైపు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. కేజ్రీవాల్ మమ్మల్ని కలిసి మా మద్దతు కోరడం జరిగిందని తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా కేంద్ర ప్రభుత్వం పక్కన పెడుతుందని నారాయణ ఆరోపించారు. ఎన్నికైన ప్రభుత్వం ఉండగా ప్రభుత్వాన్ని కాదని.. వారు నామినేట్ చేసిన గవర్నర్ ద్వారా పాలన కొనసాగించాలని చూస్తున్నారని తెలిపారు. ప్రజలచేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలకు మర్యాద లేకుండా పోతుందని దుయ్యబట్టారు. గవర్నర్ పదవి కేవలం నామినేటెడ్ పదవి మాత్రమేనని.. ఢిల్లీ గవర్నర్ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారని నారాయణ ఆరోపించారు. అన్ని రాష్ట్రాల్లో బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడిన పార్టీలపై ఐటి రైడ్స్ చేస్తున్నారని అన్నారు. కర్ణాటక ఫలితాల తర్వాత బిజెపికి దేశంలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని నారాయణ పేర్కొన్నారు.