చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్ 2025 నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. గాయం కారణంగా రుతురాజ్ 18వ సీజన్ నుంచి వైదొలిగడంతో.. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మళ్లీ సీఎస్‌కే సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ధోనీ కెప్టెన్సీలో సీఎస్‌కే విజయాలు సాదిస్తుందని అటు మేనేజ్‌మెంట్, ఇటు ఫాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. చివరిసారి ధోనీ సీఎస్‌కే కెప్టెన్‌గా ఉన్నప్పుడు గుజరాత్ టైటాన్స్ జరిగిన ఐపీఎల్ ఫైనల్‌లో చెన్నై విజయం సాధించింది. మహీ మరలా కెప్టెన్సీ చేపట్టిన నేపథ్యంలో సీఎస్‌కే కెప్టెన్స్ లిస్ట్ ఓసారి పరిశీలిద్దాం.
2008లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ చేపట్టిన ఎంఎస్ ధోనీ.. 2021 వరకు విజయవంతంగా కొనసాగాడు. ఈ కాలంలో నాలుగు సార్లు (2010, 2011, 2018, 2021) జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. 2022లో రవీంద్ర జడేజా చెన్నై సారథ్య బాధ్యతలు చేపట్టాడు. సీఎస్‌కే వరుస మ్యాచ్‌లలో ఓడిపోవడంతో జడేజా తన ఇష్టానుసారంగా కెప్టెన్సీని విడిచిపెట్టాడు. దాంతో సీఎస్‌కే ఫ్రాంచైజీ ధోనీని మరలా కెప్టెన్‌ను చేసింది. జడేజా కెప్టెన్సీలో చెన్నై 8 మ్యాచ్‌ల్లో కేవలం 2 మాత్రమే గెలిచింది. 2023లో కూడా తలా ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించి.. సీఎస్‌కేను విజేతగా నిలిపాడు. దాంతో మహీ సారథ్యంలో చెన్నై ఐదవ టైటిల్ గెలిచింది.
2024లో ఎంఎస్ ధోనీ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. గతేడాది రుతురాజ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. రుతురాజ్ కెప్టెన్సీలో ఐపీఎల్ 2025లో ఐదు మ్యాచుల్లో చెన్నై ఒకే విజయం సాధించింది. రుతురాజ్ గాయం కారణంగా.. ధోనీ మళ్లీ సీఎస్‌కే సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఇది మూడోసారి కావడం విశేషం. రుతురాజ్ కెప్టెన్‌గా 19 మ్యాచ్‌లలో 8 విజయాలు, 11 అపజయాలను చెన్నై ఎదుర్కొంది. చెన్నై కెప్టెన్ల జాబితాలో సురేష్ రైనా కూడా ఉన్నాడు. రైనా 6 మ్యాచ్‌లకు (2010-2019) నాయకత్వం వహించాడు. ఇందులో చెన్నై 2 మ్యాచ్‌లు గెలిచి, 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్ టై అయింది. కెప్టెన్‌గా ధోనీ రికార్డు అద్భుతంగా ఉంది. 235 మ్యాచ్‌లకు (ఐపీఎల్ మరియు ఛాంపియన్స్ లీగ్) కెప్టెన్‌గా ఉన్నాడు. ఇందులో 142 విజయాలు, 90 ఓటములు, 1 టై ఉన్నాయి. ఇక రెండు మ్యాచ్‌లు జరగలేదు.
Also Read: IPL 2025: మాకు యంగ్ వికెట్ కీపర్ ఉన్నాడు.. సీఎస్‌కే విజయాల బాట పడుతుంది: రుతురాజ్
సీఎస్‌కే కెప్టెన్స్ లిస్ట్:
# ఎంఎస్ ధోనీ
# సురేష్ రైనా
# రవీంద్ర జడేజా
# రుతురాజ్ గైక్వాడ్