చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఐపీఎల్ 2025 నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. రుతురాజ్ టోర్నీ నుంచి వైదొలిగడంతో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మళ్లీ సారథ్యం స్వీకరించాడు. ధోనీ కెప్టెన్సీపై రుతురాజ్ తన సోషల్ మీడియా ఖాతాలో స్పందించాడు. సీఎస్‌కేకు ఓ యంగ్ వికెట్ కీపర్ ఉన్నాడని, అతడు జట్టును ముందుకు తీసుకెళ్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. తప్పకుండా సీఎస్‌కే మళ్లీ విజయాలబాట పడుతుందని, డగౌట్ నుంచి తన మద్దతు ఎప్పుడూ జట్టుకు ఉంటుందని రుతురాజ్ తెలిపాడు.
‘ఐపీఎల్ 2025కు దూరం కావడం నిరుత్సాహానికి గురిచేస్తోంది. మోచేయి గాయం కారణంగా టోర్నీలో ఆడలేకపోతున్నా. ఇప్పటివరకు నాకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు. ఈ సీజన్ మాకు సవాల్‌తో కూడుకున్నది. అయితే మాకు ఓ యంగ్ వికెట్ కీపర్ ఉన్నాడు. అతడు జట్టును తనదైన శైలిలో ముందుకు తీసుకెళ్తాడు. తప్పకుండా చెన్నై మళ్లీ విజయాల బాట పడుతుంది. నేను జట్టుతోనే ఉంటా, డగౌట్ నుంచి నా మద్దతు ఇస్తా. కఠిన పరిస్థితుల నుంచి చెన్నై బయటపడటంను చూడాలనుంది. కుర్రాళ్లంతా కలసికట్టుగా ఆడి ఈ సీజన్‌ను ఘనంగా ముగించాలని కోరుకుంటున్నా’ అని రుతురాజ్ గైక్వాడ్ పేర్కొన్నాడు. రుతురాజ్ వీడియోను సీఎస్‌కే తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది.
Also Read: KL Rahul: ఇక్కడ నేనే తోపు.. నా కంటే ఇంకెవరికి బాగా తెలుసు: కేఎల్ రాహుల్
నేడు చెపాక్‌లో కోల్‌కతాతో చెన్నై తలపడనుంది. ఈ మ్యాచ్ సీఎస్‌కేకు చాలా కీలకం. గెలిస్తేనే ప్లేఆఫ్స్ రేసులో ఉంటుంది. ఐపీఎల్ 2025లో ప్రస్తుతం సీఎస్‌కే ఐదు మ్యాచులు ఆడి.. కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించింది. పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. టోర్నీలో మిగిలిన 9 మ్యాచుల్లో కనీసం 7 విజయాలు సాధిస్తేనే.. ప్లేఆఫ్స్ రేసులో ఉంటుంది. ఎంఎస్ ధోనీ సారథ్యంలో చెన్నై విజయాల బాట పడుతుందని ఫాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.