CPM Srinivasa Rao: టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై హాట్ కామెంట్లు చేశారు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. ఇప్పుడు పవన్ కల్యాణ్‌కు పాచిపోయిన లడ్డూలు తియ్యగా కనిపిస్తున్నాయి అని ఎద్దేవా చేశారు. మోడీ నాయకత్వంలో రాష్ట్రంలో ఏర్పడింది విద్రోహ కూటమిగా పేర్కొన్న ఆయన.. 2024లో ఏపీలో టీడీపీ, వైసీపీ ఎవరు గెలిచినా ఢిల్లీలో మోడీ పల్లకీ మోయాల్సిందే అన్నారు. బీజేపీ కూటమిని ఓడించే సత్తా వైసీపీకి లేదన్న ఆయన.. రాష్ట్ర ప్రయోజనాల పేరుతో టీడీపీ స్వార్థ రాజకీయాల కోసం పొత్తుల నాటకం ఆడుతోందని మండిపడ్డారు. ఇక, బీజేపీ, జనసేన పార్టీలకు అభ్యర్ధులను కూడా టీడీపీ ఇస్తోందని ఎద్దేవా చేశారు. ఒకే వ్యక్తి టీడీపీ, జనసేన, బీజేపీ.. ఇలా ఏ పార్టీ నుంచి అయినా పోటీ చేయోచ్చన్న రీతిలో పొత్తు సాగుతోందని.. కార్యకర్తలే అసహ్యించుకొంటున్నారు, కార్యకర్తల ఆత్మ గౌరవాన్ని పొత్తు పేరుతో ప్రశ్నిస్తున్నారు అన్నారు.
Read Also: Bandi Sanjay: బండి సంజయ్ లోకల్.. వినోద్ వలస పక్షి..
విశాఖ స్టీల్‌ప్లాంట్, రైల్వే జోన్, రాజధాని విషయంలో ఏం చెప్పినా ప్రజలను మభ్య పెట్టేందుకు మాత్రమే అన్నారు శ్రీనివాసరావు.. అప్పట్లో పాచిపాయిన బీజేపీ లడ్డూలు.. పవన్ కల్యాణ్‌కు ఇప్పుడెందుకు తియ్యగా అనిపిస్తుందో చెప్పాలి అని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీని ద్రోహి అన్న చంద్రబాబు.. ఇప్పుడు ఆ ద్రోహితో జతకట్టి రాష్ట్రానికి ఏ ద్రోహం చేయతలపెట్టారో చెప్పాలని మండిపడ్డారు. ఇక, ఎన్నికల బాండ్లు అక్రమ సంపాదన, దేశంలోనే అతిపెద్ద స్కామ్‌గా పేర్కొన్నారు. 46 వేల కోట్ల రూపాయల నల్లధనం వైట్ అయిపోయిందన్నారు. మరోవైపు.. రాజకీయ పార్టీల ట్రోలింగ్ కారణంగానే గీతాంజలి చనిపోయింది.. మహిళలను గౌరవించలేని పార్టీలు రద్దు చేసుకుంటే మంచిది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సీపీఎం ఏపీ కార్యదర్శి వి. శ్రీనివాసరావు.