CPI Narayana: పవన్ కల్యాణ్, చంద్రబాబు రాజకీయ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.. మునిగిన పడవపై ప్రయాణం చేస్తున్నారు.. మేం పవన్, చంద్రబాబుకు సపోర్ట్ చేయబోమని స్పష్టం చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ.. తిరుపతిలోని పద్మావతి పురంలో ఏబీ బర్ధన్ కమ్యూనిటీ భవన్ ను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కమ్యూనిస్టుల బలం తగ్గడంతో పార్లమెంటులో ప్రజల సమస్య పరిష్కారం కావడం లేదన్నారు.. మణిపూర్ లో యాభై వేల ఎకరాల భూమిని బీజేపీ ఆదానికి అప్పగించిందని.. గిరిజనులను బ్లాక్ మెయిల్ చేసి, అరాచకాలు చేసి లొంగ దీసుకుంటున్నారని.. పోలీసుల సమక్షంలో కార్గిల్ వీరుడిగా ఉన్న ఓ నాయకుడి భార్య, కుమార్తెను అత్యాచారం చేసి చంపేశారని.. బీజేపీ కుట్రపూరితంగా మణిపూర్ ను మండిస్తుందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఎంతో విలువైన భూమిని కార్పోరేటర్ సంస్ధలకు అప్పగిస్తున్నారు.. పార్లమెంటులో 24 మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.. బీజేపీ దేశంలో అరాచకాలను సృష్టిస్తుందన్నారు.
ఇక, ఏపీ సీఎం వైఎస్ జగన్.. బీజేపీతో కలిసే ఉన్నారని ఆరోపించారు నారాయణ.. మరోవైపు పవన్ కల్యాణ్, టీడీపీ కలిసి రాజకీయం చేయడం మొదలు పెట్టారు.. రాయలసీమ అభివృద్ధికి యాభై కోట్లు ఇస్తానని చెప్పి ఒక్క కోటు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ ఏపీ ప్రజలకు బీజేపీ అన్యాయం చేసిందన్న ఆయన.. మునిగిన పడవపై పవన్, చంద్రబాబులు ఉన్నారు.. పవన్, చంద్రబాబులు రాజకీయ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.. వారికి మేం ఎప్పుడూ సపోర్ట్ చేయబోమని స్పష్టం చేశారు. బీజేపీతో ఉండాలని ఎవరి ప్రయత్నం చేసినా తెలుగు ప్రజలకు ద్రోహం చేసినవాళ్లే అన్నారు నారాయణ.. ఎన్నికలు షెడ్యూల్ ప్రకటించగానే మా మద్దతు ఎవరికి అనేది ప్రకటిస్తామని వెల్లడించారు.
అయితే, కమ్యూనిస్టు పార్టీ.. కమ్యూనిస్టు పార్టీగానే ఉంటుంది.. కమ్యూనిస్టు పార్టీగానే ఎన్నికలలో పోటీ చేస్తాం అని తెలిపారు నారాయణ.. సీపీఐ, సీపీఎం కలిసి ఓ నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. కేంద్రం ఏ బిల్లు ప్రవేశ పెట్టినా ముందు ఓటు వేసేది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీయే అని విమర్శించారు నారాయణ.. బీజేపీ సపోర్టు చేస్తే మైనారిటీలు అంతా తిరిగి వెనక్కి వస్తారని కామెంట్ చేశారు. ఇక, ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీలో అధ్వానంగా రోడ్లు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో దొంగలు, అరాచకాలు, దౌర్జన్యం, మాఫియా పెరిగి పోతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.