Ramakrishna: ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనపై ఆరోపణలు గుప్పించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం జగన్ తాజా ఢిల్లీ పర్యటనపై స్పందిస్తూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై కేసుల విషయంలోనే సీఎం జగన్.. కేంద్ర నాయకులను కలిశారని ఆరోపించారు.. ఢిల్లీలో జగన్ మూడురోజులు ఉన్నారు.. కృష్ణాజలాలు గురించి సీఎం లేఖ ఇచ్చారో లేదో గాని గెజిట్ వచ్చేసిందన్నారు.. కృష్ణా జలాలు విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరుగుతుందన్న ఆయన.. ఉమ్మడి ఏపీలో 511, టీఎస్ 216 టీఎంసీలను తిరగదోడదామంటే ఎలా..? అని ప్రశ్నించారు. దీనివలన రాయలసీమ ఎడారిగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Asaduddin Owaisi: రేవంత్ రెడ్డి సినిమా మొత్తం మా దగ్గరుందంటూ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం..
ఇక, పోలవరం విషయంలో అంతే, ఎత్తు తగ్గించమన్నారు.. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో కేంద్రం కోత విధిస్తుందని మండిపడ్డారు రామకృష్ణ.. అన్ని ప్రాంతాలకు చెందిన పార్లమెంట్ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను అభినందించారు సీపీఐ నేత.. ఎన్డీఏలో ఉన్నా బీజేపీ అనుమతి లేకుండానే టీడీపీతో పొత్తు ప్రకటించడం అభినందించాల్సిన విషయం అన్నారు. అయితే, పవన్ కు మాకు అండర్ స్టాండింగ్ లో తేడా ఉందన్నారు. నారా లోకేష్ కు 20 రోజుల్లో 2 నిముషాలు ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని విమర్శించారు.. ఇదే సమయంలో.. సీఎం జగన్‌కు గంటల తరబడి మోడీ అపాయింట్‌మెంట్ ఇస్తారని మండిపడ్డారు.. ఇక, పవన్ కల్యాణ్ సరైన సమయంలో బీజేపీని అర్థం చేసుకొంటారని వ్యాఖ్యానించారు సీపీఐ ఏపీ కార్యదర్శి కె. రామకృష్ణ.