సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ (Congress) సన్నద్ధమవుతోంది. ఈనెలలోనే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులను సన్నద్ధం చేస్తోంది. ఇప్పటికే అధికార బీజేపీ ఎన్నికల శంఖారావం పూరించింది. ప్రధాని మోడీ (PM Modi) ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తూ.. పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తూ ప్రచారం చేపడుతున్నారు. అలాగే అభ్యర్థుల లిస్టు కూడా రెడీ అయిపోయింది. మరికొన్ని గంటల్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కూడా ఎన్నికల శంఖారావం పూరించడానికి సిద్ధమవుతోంది. వచ్చే వారం నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించేందుకు సిద్ధపడుతోంది. మరోవైపు మార్చి 4న మేనిఫెస్టో కమిటీ (Manifesto committee)కూడా సమావేశం అవుతోంది. ఈ సమావేశంలో 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ ఇవ్వబోయే హామీలు, పథకాలపై చర్చించనుంది.
ఇదిలా ఉంటే ప్రతిపక్ష పార్టీలన్నీ ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. ఇప్పటికే ఆయా పార్టీలతో కాంగ్రెస్ చర్చలు జరిపింది. సీట్లు సర్దుబాటుపై కూడా ఒక క్లారిటీ వచ్చినట్లు సమాచారం. మరోవైపు దేశ వ్యాప్తంగా భారత్ జోడో న్యాయ పేరుతో రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తున్నారు. ఇండియా కూటమిని గెలిపించాలని కోరుతున్నారు