Bhatti Vikramarka: తెలంగాణ ఎగ్జిట్‌పోల్స్‌లో కాంగ్రెస్ అధికారంలో వస్తుందన్న అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్‌పోల్స్‌లో కాంగ్రెస్ భారీ విజయం సాధిస్తుందని తేలిందని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. డిసెంబర్ 3 తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అధికార దుర్వినియోగం చేస్తూ బీఆర్‌ఎస్ నేతలు భూదోపిడీకి పాల్పడ్డారని భట్టి విమర్శించారు. ధరణిని అడ్డపెట్టుకుని హైదరాబాద్ పరిధిలో వేలాది ఎకరాలు దోచుకున్నారని.. లక్షల కోట్ల విలువైన భూములు ప్రజలకు, ప్రభుత్వానికి చెందకుండా పోయే ప్రమాదం ఏర్పడిందని అన్నారు. రెవెన్యూ వ్యవస్థను అప్రమత్తం చేస్తున్నాం.. బీఆర్‌ఎస్ నేతలు చెప్పే అడ్డగోలు పనులు చేయవద్దని రెవెన్యూ అధికారులకు సూచిస్తున్నామన్నారు. కాంట్రాక్టర్లకు వేల కోట్ల చెల్లింపులు ఈ రెండు మూడు రోజుల్లో చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ విషయం గురించి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని భట్టి విక్రమార్క చెప్పారు.
Read Also: Telangana Exit Polls 2023: ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్.. తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం
ఒక ప్రభుత్వం నుంచి మరొక ప్రభుత్వం మారుతున్న క్రమంలో ఇష్టరాజ్యoగా వ్యవహరించకుండా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని భట్టి సూచించారు. తెలంగాణలో గత ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ధర్మపురి, హుజూర్ నగర్, మంచిర్యాల, ఇబ్రహీంపట్నం, తుంగతుర్తిలో ఇబ్బందులు నెలకొన్నాయన్నారు. ప్రస్తుతం కోర్టులలో కేసులు కూడా ఇంకా నడుస్తున్నాయని.. కాంగ్రెస్ కార్యకర్తలు కౌంటింగ్ పూర్తయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలు మార్పు కోసం తీసుకున్న నిర్ణయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు.