MLC Jeevan Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం తాగునీరు, సాగు నీరు, విద్యుత్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై, భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ల అవినీతిపై విచారణ చేపడితే కేసీఆర్‌కు వణుకు పుడుతోందని ఆయన విమర్శించారు. కాళేశ్వరంపై టీవీ ముందుకు వస్తా అంటారని.. ఆ ప్రాజెక్టులో 20 కంపోనెంట్లు ఉన్నాయని, మేడిగడ్డలో ఒకటి రెండు పిల్లర్లు కుంగితే రాద్ధాంతం అంటున్నారని కేసీఆర్‌పై మండిపడ్డారు. టీవీ ముందుకు వస్తే మంచిదే.. వాస్తవాలు తెలుస్తాయన్నారు. బీజేపీ జాతీయ స్థాయిలో తుడిచిపెట్టుకొని పోతుందన్నారు.
బీజేపీ అధికారంలోకి వస్తే నల్లధనాన్ని వెలికితీసి పేద ప్రజలకు ఆర్థిక సహాయం చేస్తామని మోడీ అన్నారని.. వెలికి తీసిన నల్లధనం ఎక్కడ అంటూ ఆయన ప్రశ్నించారు. మోడీ హామీ ప్రకారం 10 ఏండ్లలో 20కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. కానీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో బీజేపీ కిషన్ రెడ్డి చెప్పాలన్నారు. మోడీ కూడా మరో కేసీఆర్ అయ్యారంటూ విమర్శించారు. ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో సుప్రీంకోర్టు మొట్టికాయ వేసిందన్నారు.
Read Also: Hyderabad: నాలుగు రాళ్లు వెనకేసుకోమంటే 418 రాళ్లు వేసుకున్నాడు.. షాకైన డాక్టర్లు!
ఆర్బీఐ అమిత్ షా అండర్‌లో పని చేస్తోందని ఆయన ఆరోపించారు. దేశంలో మతపరమైన రిజర్వేషన్లు కల్పించాలని అమిత్ షా అంటున్నారని.. మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు తీసి వేస్తారని ఆరోపణలు చేశారు. ఓబీసీ పేరుతో మోడీ అధికారంలోకి వచ్చాడని, వాళ్ళను పట్టించుకోలేదన్నారు. రాహుల్ గాంధీ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని కోరుకుంటున్నారన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే రాజ్యాంగ సవరణ చేసి జనాభా దామాషా ప్రకారం బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కలిపిస్తామన్నారు. తెలంగాణలో మార్పు ఏవిధంగా వచ్చిందో, దేశంలో కూడా రాబోతుంది, ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.