CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ మొదలైంది.. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఇక, ఇప్పటికే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ వస్తున్నారు.. మరోవైపు ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు వైసీపీ కీలక సమావేశం జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యనేతలను సమాయత్తం చేసేందుకు వైసీపీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన తాడేపల్లి సీకే కన్వెన్షన్‌లో ఈ మీటింగ్ జరగనుంది. ఉదయం 9.30 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది.. 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నేతలు హాజరు కానున్నారు. సుమారు 2 వేలకు పైగా మండల స్థాయి నేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ ఎన్నికల్లో వై నాట్ 175 లక్ష్యంగా నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.
Read Also: IVPL 2024: క్రిస్ గేల్ 10 సిక్సర్లు బాదినా.. తెలంగాణకు తప్పని ఓటమి!
ఇక, ఈ సమావేశంలో ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ఫలాలను ప్రజలకు వివరించాలని నేతలకు సూచనలు చేయనున్నారు సీఎం జగన్.. ఈ సమావేశానికి మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లకు పార్టీ ప్రతిష్టతపై గ్రౌండ్ లెవల్ లో తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేస్తారు. జిల్లాల్లో పార్టీ నేతల మధ్య విభేదాలు పరిష్కరించుకుని, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా సీఎం జగన్ మార్గనిర్దేశం చేయనున్నారు. గత ఐదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలే మరోసారి వైసీపీని అధికారంలోకి తీసుకువస్తాయని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత.. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని నేతలకు సూచించనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న తరుణంలో.. ఓవైపు ప్రచారంతో హోరెత్తిస్తూనే.. మరోవైపు.. పార్టీలో అంతర్గత విభేధాలు లేకుండా అందరినీ ఒకే తాటిపైకి తెచ్చేలా చర్యలకు పూనుకున్నారు సీఎం వైఎస్ జగన్.