CM YS Jagan: మరో 3 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాబోయే ఐదేళ్ల ఇంటింటి అభివృద్ధి, పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలు ఇవి అని సీఎం అన్నారు. జగన్‌కు ఓటేస్తే పథకాల కొనసాగింపు అని.. పొరపాటు చంద్రబాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపేనని ఆయన పేర్కొన్నారు. సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చారని సీఎం జగన్ చెప్పారు. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చామన్నారు. రూ.2లక్షల 70 వేల కోట్లు డీబీటీ ద్వారా సంక్షేమ పథకాలు అందించామన్నారు. “ఈ 59 నెలల్లో గతంలో ఎన్నడూ జరగని విధంగా మార్పులు తీసుకొచ్చాం.. ఐదేళ్లు లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అందించాం.. విద్యార్థులకు ట్యాబ్‌లు, వసతి దీవెన, విద్యా దీవెన, అమ్మ ఒడి అందించాం.. బైలింగ్వల్ పాఠ్యపుస్తకాలు ఇస్తున్నాం.. నాడు-నేడుతో ప్రభుత్వ పాఠశాలలను బాగు చేశాం.. పేదల తలరాత మారాలంటే ఈ పథకాలు ఎంత అవసరమో ఆలోచించండి.” అని సీఎం జగన్ పేర్కొన్నారు.
Read Also: Election Campaign: ప్రచారానికి ఇంకా 2 రోజులే.. దూకుడు పెంచిన పార్టీలు
గతంలో ఎప్పుడైనా ఇంటికే రేషన్, పౌరసేవలు, పెన్షన్లు అందాయా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. స్వయం ఉపాధి రంగాల్లో ఉన్నవారికి గతంలో పథకాలు ఉండేవా అని అడిగారు. లా నేస్తం, చేదోడు, వాహనమిత్ర అందించామని సీఎం తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల దాకా పేదవాడికి ఉచిత వైద్యం అందిస్తున్నామన్నారు. ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్, ఆరోగ్య సురక్ష అందిస్తూ ప్రజలకు అండగా ఉన్నామన్నారు. రైతన్నకు పెట్టుడి సాయం, పగటి పూటనే 9 గంటల పాటు ఉచిత విద్యుత్, ఆర్బీకే వ్యవస్థను తీసుకొచ్చామని సీఎం వెల్లడించారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకు వస్తుందా అని ప్రశ్నించారు. మతం వర్గం, రాజకీయ పార్టీ చూడకుండా సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
2014లో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోలో ఎన్ని హామీలు నెరవేర్చారని సీఎం జగన్ ప్రశ్నించారు. రైతు రుణమాఫీ, పొదుపు సంఘాల రుణాలను చంద్రబాబు మాఫీ చేశారా అంటూ సీఎం అడిగారు. “ఆడబిడ్డ పుడితే రూ.25 వేలు అకౌంట్‌లో వేస్తామన్న చంద్రబాబు ఒక్క రూపాయి అయినా వేశారా.. నిరుద్యోగ భృతిని చంద్రబాబు ఎవరికైనా ఇచ్చారా?.. అర్హులందరికీ 3 సెంట్ల స్థలం ఇస్తామన్న చంద్రబాబు.. ఒక్క సెంట్ అయినా ఇచ్చారా?.. సింగపూర్‌కు మించి అభివృద్ధి చేస్తామన్న చంద్రబాబు.. ఆ హామీని నెరవేర్చారా?” అని చంద్రబాబుపై సీఎం జగన్ ప్రశ్నల వర్షం కురిపించారు.