సీఎం కేసీఆర్ ఈరోజు యాదాద్రి లక్ష్మీనృసింహ స్వామి వారిని దర్శించుకొని, ఆలయ గోపురానికి బంగారం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. యాదాద్రి ఆలయానికి అనుబంధంగా జరిగే నిర్మాణాలు ఆధ్యాత్మిక శోభ విలసిల్లేలా అత్యంత వైభవంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. యాదాద్రి అభివృద్ధి కోసం రూ.43 కోట్ల నిధులను వెంటనే విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తం వైటీడీఏకు 2,157 ఎకరాల భూమిని రెవెన్యూశాఖ పూర్తిస్థాయిలో అప్పగిస్తుందని, దాని నిర్వహణను వైటీడీఏ అధికారులు చూసుకోవాలని ఆయన అన్నారు. అంతేకాకుండా.. ఈ భూమిలో ఆలయ అవసరాలు, పోలీసుశాఖ, ఫైర్ స్టేషన్, హెల్త్, రవాణా, పార్కింగ్ వంటి యాదాద్రి అభివృద్ధికి సంబంధించిన అనుబంధ సేవల కోసం మాత్రమేనని, ఆలయ అర్చకులకు, సిబ్బందికి కూడా ఇందులోనే ఇళ్ల స్థలాలు ఉంటాయని, యాదాద్రిలో ఉన్న విలేకరులకు వైటీడీఏ బయటప్రాంతంలో ఇళ్ల స్థలాలు అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. యాదాద్రి టెంపుల్ టౌన్ తో పాటు ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న కాటేజీల నిర్మాణం, ఆలయ వైభవాన్ని ప్రతిబింబించేలా, పవిత్రమైన భావన వచ్చేలా ఉండాలని, దాతలు కాటేజీల నిర్మాణం కోసం ఇచ్చే విరాళాలకు ఆదాయ పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. సంబంధించిన 80జీ అనుమతులు వెంటనే తీసుకోవాలని, ఒక ప్రణాళిక ప్రకారం యాదాద్రి పరిసరాలు అభివృద్ధి చేపడుతున్నట్లు తెలిపారు.
హెలీపాడ్ ల నిర్మాణం కూడా చేపట్టాలని, యాదాద్రి ఆలయ వైభవానికి అనుగుణంగా వైటీడీఏ సమీపంలో జరిగే ప్రైవేటు నిర్మాణాలకు, జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే అధికారులు అనుమతి ఇవ్వాలన్నారు. వైటీడీఏ పరిధిలో ఉన్న100 ఎకరాల అడవిని ‘‘నృసింహ అభయారణ్యం’’ పేరిట అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నట్లు, స్వామివారి నిత్య పూజలు, కల్యాణం, అర్చనలకు అవసరమైన పూలు, పత్రాలు ఆ అరణ్యంలోనే అందుబాటు ఉంటాయన్నారు. 50 ఎకరాల్లో అమ్మవారి పేరుమీద ఒక కల్యాణ మండపం నిర్మాణం, ఆలయం సహా రింగు రోడ్డు మధ్యలో ఏ ప్రాంతంలోనూ ఒక్క చుక్క నీరు నిలబడకుండా డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు, ఆలయానికి వచ్చే భక్తులకు క్యూలైన్లు సహా ఇతర అన్నిచోట్ల ఎలాంటి చిన్న ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు, దీక్షాపరుల మంటపం, వ్రత మంటపం, ఆర్టీసీ బస్టాండు, స్టామ్ వాటర్ డ్రయిన్ల నిర్మాణంలో అన్ని జాగ్రత్తలు, 250 ఎకరాలలో నిర్మించే 250 కాటేజీలను నాలుగు భాగాలుగా విభజించి, నాలుగు రకాల ఆధ్యాత్మిక డిజైన్లతో సుందరంగా, అద్భుతంగా నిర్మించాలి, వాటికి ప్రహ్లాద, యాద మహర్షి తదితర ఆలయ చరిత్రకు సంబంధించిన పేర్లు, ఆలయ ఆదాయం, ఖర్చుల ఆడిటింగ్ వ్యవస్థ అత్యంత పారదర్శకంగా ఉండేలా జాగ్రత్తలు, ఆలయ నిర్వహణ కోసం నిధులు నిల్వ ఉండేలా చర్యలు, మినీ శిల్పారామం తరహాలో ఒక మీటింగ్ హాల్, స్టేజీ, స్క్రీన్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.