AP CM Chandrababu: ఎమ్మెల్యేలు, ఎంపీల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 26వ తేదీ నుంచి తెలుగుదేశం సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. దేశంలోనే మొట్టమొదటిసారి కార్యకర్తలకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించామన్నారు. సాధారణ సభ్యత్వ రుసుము ఎప్పటిలాగా రూ.100 ఉంటుందని.. ఈ ఏడాది నుంచి కొత్తగా లైఫ్ టైం సభ్యత్వాన్ని ప్రవేశపెడుతున్నాం.. దీని రుసుము రూ.1,00,000 గా నిర్ణయించామన్నారు. మెంబర్ షిప్ ఉన్న వారు చనిపోతే అందించే ఇన్సూరెన్స్‌ను రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నామన్నారు. చనిపోయిన కార్యకర్తలకు రూ.10 వేలు మట్టి ఖర్చులు ఇస్తామన్నారు. గతంలో ఇన్స్యూరెన్స్ రాని 73 మందికి రెండు లక్షల చొప్పున ఇచ్చేందుకు నిర్ణయించామన్నారు. ప్రమాద బీమా కింద ఇప్పటి వరకు రూ.102 కోట్లు, సహజ మరణం, ఇతర సమస్యలకు రూ.18 కోట్లు సాయంగా అందించామన్నారు. విద్యార్థుల చదువు కోసం రూ.2 కోట్ల 35 లక్షలు అందించామని సీఎం చంద్రబాబు తెలిపారు. లీడర్, క్యాడర్, ఎంపవర్‌మెంట్ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
అవినీతి మరక లేకుండా క్యాడర్‌ను ఆర్థికంగా నిలబెట్టే ఆలోచనలు చేస్తున్నామన్నారు. పార్టీ కోసం పనిచేసిన నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిద్దామని సీఎం వెల్లడించారు. ప్రతి ఎమ్మెల్యే తమ నియోజకవర్గంలో ఈ తరహా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకమైన క్రమశిక్షణ ఉంది.. మనకు ఒక ఫిలాసపీ ఉందన్నారు. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన చరిత్ర ఉన్న పార్టీ తెలుగుదేశమని అన్నారు. కానీ ఎప్పుడూ ప్రజల కోసమే పనిచేశామన్నారు. ప్రజల ఆశీర్వాదంతో పాటు కార్యకర్తల త్యాగాల వల్ల నేడు మనం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా ఉన్నామన్నారు. ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నాం అనే దానికంటే.. ఎంత క్రమశిక్షణగా ఎంత మంది ఉన్నాం అనేది ముఖ్యమన్నారు.2014లో మనం 104 మందితోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉంటే.. ప్రజలకు ఎక్కువ మేలు జరగాలి.. మీ పనితీరు ఆ విధంగా ఉండాలన్నారు. ఏ ఒక్క ఎమ్మెల్యేనైనా వల్ల పార్టీకి, తనకు చెడ్డపేరు వస్తే సహించేది లేదన్నారు.
Read Also: Balakrishna: బాలకృష్ణ ఆశీర్వాదం తీసుకున్న ఏపీ హోమ్ మంత్రి
ఎమ్మెల్యేలు ఎంపీలను గౌరవించి కలుపుకొని పోవాలన్నారు. కొంత మంది ఎమ్మెల్యేలు క్యాడర్‌ను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. క్యాడర్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారు.. నా దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి.. ఈ విధానం మంచిది కాదన్నారు. ఏ వ్యక్తి కూడా పార్టీ, క్యాడర్ లేకుండా గెలవలేరన్నారు. పార్టీ వద్దనుకునే వాళ్లు ఇండిపెండెంట్‌గా గెలిచి ఉండి ఉండాలన్నారు. పార్టీని రీస్ట్రక్చర్ చేసిన ప్రతిసారీ కార్యకర్తలు అర్థం చేసుకుని మద్దతుగా నిలిచారన్నారు.మనం ఏం నిర్ణయం తీసుకున్నా పార్టీకి మంచి జరగాలని కార్యకర్తలు అధిష్టానం నిర్ణయాలకు మద్దతు పలికారన్నారు. పార్టీ ద్వారా గెలిచిన వాళ్లు పార్టీ సిద్దాంతాలకు, నిర్ణయాలకు కట్టుబడి పని చేయాలన్నారు. పొలిటికల్ గవర్నెన్స్ అంటే ప్రజలకు చేసే మంచిలో మనం భాగస్వాములుగా ఉండడమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీని క్యారీ చెయ్యాలి.. పబ్లిక్‌ను కన్విన్స్ చేయాలి.. ఇది జరగకపోవడం వల్లనే గతంలో నష్టం జరిగిందన్నారు. తప్పు చేసిన వాళ్లను చట్టబద్దంగా శిక్షిద్దామని పేర్కొన్నారు. అంతేగాని ఇష్టం వచ్చినట్లు అరెస్టులు జరగాలి అంటే కుదరదు.. అది మన విధానం కాదన్నారు.
చెడ్డపేరు తెచ్చుకునేందుకు మాత్రం సిద్దంగా లేనన్నారు. ఇసుక విషయంలో ఎవరు వేలు పెట్టవద్దన్న ఆయన.. ఇసుక విషయంలో తప్పు చేస్తే ఎవరినీ ఉపేక్షించవద్దని అధికారులకు స్పష్టంగా చెప్పానన్నారు. ఇసుక విధానం సక్రమంగా అమలు కాకపోతే అధికారులను కూడా బాధ్యులను చేస్తానని చెప్పానన్నారు.వాళ్లూ నిబంధనల అమలులో కఠినంగా ఉండాలన్నారు. ఇసుక విషయంలో ప్రజలకు హామీ ఇచ్చానన్న చంద్రబాబు.. దాన్ని అమలు చేసి చూపాల్సిందేనన్నారు. ఎవరో ఒకరిద్దరు కోసం ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తే ఎందుకు సహించాలన్నారు. మద్యం విషయంలో కూడా ఎవరూ జోక్యం చేసుకోవద్దన్నారు. 2029లో మళ్లీ మీ అందరినీ గెలిపించుకోవాలని చూస్తున్నా.. మీ పనితీరు కూడా బాగుండాలన్నారు. మీ పనితీరుపై మళ్లీ త్వరలో ఐవీఆర్ఎస్ ద్వారా సమాచారం, ఫీడ్ బ్యాక్ తీసుకుంటామన్నారు. ప్రజలనుంచి వస్తున్న వినతులను పరిష్కరించే విషయంలో ఎమ్మెల్యేలు శ్రద్ద చూపాలన్నారు. ప్రజల నుంచి వచ్చే వినతుల పరిష్కారంపై పర్యవేక్షణకు మంత్రులతో సబ్ కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేద్దామని సీఎం పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి వినతిని పరిష్కరించే విధానం తీసుకువద్దామని తెలిపారు.
Read Also: Amaravati Drone Summit 2024: డ్రోన్ సమ్మిట్ ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. “కేంద్రం మన రాష్ట్రంలో హైవేలపై రూ.1 లక్ష కోట్లు ఖర్చు పెట్టబోతోంది. అలాగే రైల్వేలో రూ. 75 వేల కోట్ల పనులు మన దగ్గర జరగనున్నాయి. ఈ పనులు వేగంగా పూర్తి అయ్యేలా మనం కూడా సహకరించాలి. వీటిపై ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓనర్ షిప్ తీసుకుని పనిచేయాలి. అప్పుడు ప్రజల్లో మంచి పేరు వస్తుంది. ఆ ప్రాజెక్టులు వేగంగా పూర్తి అయ్యేలా దృష్టిపెట్టాలి.
పట్టభద్రుల ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు బాధ్యత తీసుకోవాలి. పట్టభద్రుల ఓట్ల నమోదులో పార్టీ నేతలు పనిచేయాలి. ఓట్ల నమోదుకు ఇంకా 19 రోజుల సమయం మాత్రమే ఉంది.మంత్రులు జిల్లాలకు వెళ్లినప్పుడు ఎమ్మెల్యేలకు, జిల్లా పార్టీ అధ్యక్షులకు తప్పకుండా సమాచారం ఇవ్వాలి. కూటమి నేతలతో కూడా సమన్వయం చేసుకోవాలి.”అని అన్నారు.