రాబోయే రోజుల్లో గేమ్ చేంజర్‌గా జీఎస్టీ ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. జీఎస్టీ సంస్కరణలతో పేదల జీవితాల్లో అనేక మార్పులు వస్తాయన్నారు. ‘సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్’ అని పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణలతో మేడిన్ ఇండియా మరింత బలోపేతం అవుతోందన్నారు. బలమైన, సమతుల్యమైన సమాజ నిర్మాణమే లక్ష్యమని సీఎం చెప్పారు. దసరా నుంచి దీపావళి వరకు జీఎస్టీ ఉత్సవాలు నిర్వహిస్తామని సీఎం తెలిపారు. జీఎస్టీ సంస్కరణలపై ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడారు.
‘రాష్ట్ర ప్రజాలకు దసరా శుభాకాంక్షలు. సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్. రాబోయే రోజుల్లో గేమ్ చేంజర్‌గా జీఎస్టీ ఉంటుంది. 30 రోజుల పాటు జీఎస్టీ కార్యక్రమం జరుగుతుంది. నారా లోకేష్, వంగలపూడి అనిత, సత్యకుమర్ యాదవ్, కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్‌లతో కమిటీ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. జీఎస్టీ సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థలో కీలకం అని ప్రధాని చెప్పారు. ఏపీలో కూడా ప్రగతిశీల ప్రజా విధానంతో పేదల జీవితాలు మార్చడమే మా లక్ష్యం. ఈ లక్ష్యానికి సూపర్ జీఎస్టీ, పీ4 ఉపయోగపడతాయి. ప్రతి ఇల్లు రీచ్ అయ్యేలా జీఎస్టీ కార్యక్రమాలు ఉండాలి. దసరా నుంచి దీపావళి వరకూ జీఎస్టీ 2.0 సంస్కరణలపై ప్రతీ ఇంటికీ తెలిసేలా ప్రచారం నిర్వహిస్తాం. 65 వేలకు పైగా సమావేశాలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించాం. హౌస్ హోల్డ్ సేవింగ్స్ ఎలా పెరిగాయి, అగ్రికల్చర్ వల్ల ఎలాంటి లాభం వచ్చింది, మానవ వనరుల అభివృద్ధి, టెక్నాలజీ ఉపయోగం, అభివృద్ధి. సంపద సృష్టికి సంబంధించి అవగహన ఉంటుంది’ అని సీఎం చంద్రబాబు చెప్పారు.
Also Read: Nara Lokesh: పవన్ అన్నను ఆహ్వానించా.. ఇక ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహిస్తాం!
‘పేదలు, మధ్యతరగతి ప్రజల జీవితాలను మార్చటమే లక్ష్యం. 2047 నాటికల్లా ఈ లక్ష్యాల సాధనకు జీఎస్టీ, సూపర్ సిక్స్, పీ4 కార్యక్రమాలు శక్తివంతంగా పనిచేస్తాయి. నిత్యావసర వస్తువుల్లో చాలా వాటికి సున్నా శాతం పన్ను ఉంది. అలాగే చిన్న చిన్న వ్యాపారాలకు లబ్ది కలుగుతుంది. ఎంఎస్ఎంఈలకు పెద్ద ఎత్తున ఈ జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రయోజనం కలుగుతుంది. స్వదేశీ, మేక్ ఇన్ ఇండియా నినాదాలకు ప్రత్యక్షంగా నెక్స్ జెన్ జీఎస్టీ సంస్కరణలు పెద్ద ఎత్తున తోడ్పడతాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు పెద్ద ఎత్తున సహకారం లభిస్తుంది. గ్లోబల్ బ్రాండ్లుగా భారతీయ ఉత్పత్తులు పోటీ పడేందుకు పెద్ద ఎత్తున ఆస్కారం కలుగుతుంది. భారతీయ ఉత్పత్తులు కొనుగోలు చేస్తే దేశాభివృద్ధిలో నేరుగా భాగస్వాములైనట్టే. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రజలందరికీ పిలుపును ఇస్తున్నాను’ అని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.