Chandrababu: ఢిల్లీ వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. మొదట ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. రెండు ప్రధాన అంశాలపై ఢిల్లీకి వచ్చాను.. ఒకటి ఎన్టీఆర్ 100వ జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల చేయడం.. ఎన్టీఆర్ కు కేంద్రం ఇచ్చిన గౌరవం అన్నారు. దేశ రాజకీయాల్లో దశ దిశా చూపిన వ్యక్తి ఎన్టీఆర్ అని పేర్కొన్న ఆయన.. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలనేది చిరకాల వాంఛ అన్నారు. ఇక, అతి ముఖ్యమైన సమస్య.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఇక్కడకు వచ్చాను.. వింత విచిత్ర సమస్యగా ఉంది.. ఒక పార్టీ ఓట్లు తీసేసే ఆలోచన ఎవ్వరికీ రాలేదు.. కానీ, ఇప్పుడు జరుగుతోంది.. దీనిపై ఆధారాలతో సహా పోరాడాం.. ఈ ప్రభుత్వం వచ్చాక నాలుగైదు ఎన్నికలు జరిగాయి.. అన్నింటిలో దొంగ ఓట్లతో గెలిచారని దుయ్యబట్టారు. ఎన్నికల కమిషన్ చర్యలకు ఉపక్రమించినా, అమలు చేయకపోవడం దారుణమైన విషయం అన్నారు. గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో కూడా అవకతవకలు చేశారు.. అయినా మేమే గెలిచాం అన్నారు చంద్రబాబు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ అధినేత.. ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేస్తున్నారు.. మాస్క్ ఇవ్వాలని అడిగితే, డాక్టర్ సుధాకర్ ను బెదిరించి చంపించేశారు.. ఎదురు తిరిగితే ఇబ్బందులకు గురి చేయడం కామన్ గా మారిపోయిందన్నారు. రౌడీయిజం నాకు తెలియదు.. నామీద దాడి చేసి.. నా మీదే కేసు పెట్టారు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు. అధికారులను భయపెట్టారు. మీడియాను భయపెడ్తున్నారు.. టీడీపీ ఓట్లను తీసేస్తున్నారు.. ఆధారాలతో ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశానని తెలిపారు. చంద్రగిరిలో ఒక పోలింగ్ స్టేషన్ పెట్టారు.. ఎప్పుడో కట్టబోయే భవనాన్ని నోటిఫై చేశారు.. విశాఖలో, మచిలీపట్నంలో ఓట్లు తొలగించారు.. ఉరవకొండలో ఇలాగే జరిగింది.. 15 లక్షల ఓట్లు దొంగ ఓట్లుగా చేర్చారు.. డోర్ నంబర్ జీరోలో వందల ఓట్లు ఉన్నాయి.. ఎక్కడ ఏం జరిగింది.. అనేది స్పష్టమయిన ఆధారాలతో ఈసీకి ఇచ్చామని, వాలంటీర్ల అరాచకాలపై ఆధారాలు కూడా ఈసీకి ఇచ్చామని వివరించారు.
వాలంటీర్లు కాకుండా, టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఓటర్ల జాబితాను రూపొందించాలని డిమాండ్ చేశారు చంద్రబాబు.. ఏపీ ప్రభుత్వానికి కావాల్సిన మనుషులను పెట్టొద్దన్న ఆయన.. ఇలాంటి అవకతవకలు ఎక్కడ జరగలేదన్నారు.. ఎన్నికల కమిషన్ మొత్తం ఏపీకి వచ్చి విచారణ జరపాలన్నారు. ఎన్నికల అవకతకలపై హై పవర్ కమిటీ వేయాలి.. పగద్బందీగా పటిష్ఠమైన ఓ వ్యవస్థను రూపొందించి ఓటర్లు జాబితాను సరిచేయాలని ఈసీని కోరామన్నారు. ఓట్ల వ్యవహారం తెలకే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు చంద్రబాబు.. ఎన్నికల సంఘం ముందుకు మేం రాగానే వాళ్లు వచ్చారు.. ఎప్పుడో రావచ్చు కదా? అని మండిపడ్డారు.. దీనిని సరిచేయాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంది. ఆధారాలతో సహా ఫిర్యాదు చేశాం.. నిజనిర్ధారణ చేసే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరించాలన్నారు. ఉన్నతస్థాయి కమిటీ వేయాలి.. వేరే రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారిని నియమించి ఓటర్ల జాబితాను సరిచేయాలి. తప్పుచేసిన వారిపై చర్యలు తీసుకుంటే అంతా సర్దుబాటు అవుతుందన్నారు చంద్రబాబు నాయుడు.