Delhi Liquor Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన ఎమ్మెల్సీ కవితను నేడు కోర్టులో హాజరు పరచనుంది సీబీఐ. నిన్న కవితను అరెస్ట్ చేసిన అధికారులు ఆమెను సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌కు తరలించారు. ఈ ఉదయం కోర్టు ముందు ప్రవేశపెట్టి కస్టడీకీ తీసుకోనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత కీలక పాత్ర పోషించారంటున్న సీబీఐ ఆమెను ప్రశ్నిస్తేనే మరిన్ని వివరాలు బయటకు వస్తాయంటోంది. సౌత్ గ్రూపుకు ఆప్‌కు మధ్య కవిత దళారీగా వ్యవహరిస్తూ 100 కోట్ల ముడుపులు చెల్లించడంలో కీలకపాత్ర పోషించారని సీబీఐ అభియోగం మోపింది. ఈనెల 6న తీహార్ జైల్లోనే కవితను ప్రశ్నించింది సీబీఐ. తనను సీబీఐ ప్రశ్నించడాన్ని కవిత కోర్టులో సవాల్ చేశారు. ఆ కేసు విచారణ జరగకముందే ఆమెను సీబీఐ అరెస్ట్ చేసింది.
Read Also: SBI: ఎలక్టోరల్ బాండ్ల వివరాలు ఆర్‌టీఐ కింద వెల్లడించలేం
ఇటు సీబీఐ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కవిత రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. అత్యవసరంగా సీబీఐ స్పెషల్ కోర్టు ముందు అప్లికేషన్ ఫైల్ చేశారు. నోటీసు ఇవ్వకుండా సీబీఐ అరెస్ట్ చేసిందని కవిత తరఫు లాయర్లు వాదనలు వినిపించారు. జడ్జ్ ఆదేశాలతో ఈ ఉదయం రెగ్యులర్ కోర్టు ముందు అప్లికేషన్ ఫైల్ చేయనున్నారు ఆమె లాయర్లు. పరిస్థితి చూస్తుంటే కవిత ఇప్పట్లో జైలు నుంచి బయటకు రావడం అనుమానంగానే కనిపిస్తోంది. లిక్కర్ కేసులో ఆమె పూర్తిగా ఈడీ, సీబీఐ చట్రంలో చిక్కుకుపోయారు. కవితను మార్చి 15న ఈడీ అరెస్టు చేసింది, విచారణ తర్వాత ఆమెను తీహార్ జైలుకు తరలించారు. ఇప్పుడు ఆమెను సీబీఐ పీటీ వారంట్ పై అరెస్టు చేశారు. ఒకవేళ సీబీఐ కస్టడీకి ఇస్తే.. అధికారులు ఆమెను సీబీఐ కార్యాలయానికి తరలించి ప్రశ్నిస్తారు. కవితకు ఈడీ కోర్టు బెయిల్ ఇచ్చినా.. సీబీఐ కేసుతో ఆమె జైలులోనే ఉండాల్సి ఉంటుంది. సీబీఐ కోర్టు కూడా బెయిల్ ఇస్తేనే ఆమె బయటికొస్తారు. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ రావడం అంత ఈజీ కాదు. గతంలో చాలా కేసుల్లో నెల తరబడి నిందితులు జైలులోనే ఉన్నారు.ఇదే లిక్కర్ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియా ఎన్నో నెలలుగా తీహార్ జైలులోనే ఉన్నారు. మొత్తంగా చూస్తే.. నెలల తరబడి జైలులో ఉండాల్సిన పరిస్థితులే కనిపిస్తున్నాయి.