మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఇవాళ ఎంపీ అవినాష్‌రెడ్డిని ప్రశ్నించనుంది సీబీఐ. ఇవాళ్టి నుంచి ఆరురోజులపాటు విచారించనుంది. ఈనెల 24 వరకు ఆయన్ని ప్రశ్నించనుంది సీబీఐ టీమ్.. అయితే, ఈ నెల 25 వరకు అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయొద్దని సీబీఐని ఆదేశించింది ఇప్పటికే తెలంగాణ హైకోర్టు. అప్పటి వరకు ప్రతి రోజూ సీబీఐ విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అవినాష్ రెడ్డి విచారణ మొత్తాన్ని ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని తెల్పింది. విచారణ సమయంలో ప్రశ్నలను లిఖితపూర్వకంగానే ఇవ్వాలని సూచించింది. ఈనెల 25న తుది తీర్పు ఇస్తామని హైకోర్టు చెప్పడంతో.. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఉదయ్‌కుమార్ రెడ్డిలను కలిపి విచారణ చేయనుంది సీబీఐ.
కాగా, తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాష్‌రెడ్డికి ఊరట లభించింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో… ఈ నెల 25 వరకు అరెస్ట్ చేయవద్దని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. అవినాష్‌రెడ్డి విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయాలని సూచించింది. మరోవైపు ఇదే కేసులో వైఎస్ భాస్కర్‌రెడ్డి, ఉదయ్ కుమార్‌రెడ్డిని.. ఇవాళ్టి నుంచి ఆరు రోజులపాటు కస్టడీకి అనుమతించింది న్యాయస్థానం. అంతకుముందు వివేకానందరెడ్డి హత్య కేసుపై తెలంగాణ హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. కోర్టులో అవినాష్‌రెడ్డి తరపు న్యాయవాది, సునీతారెడ్డి లాయర్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి చెప్పింది సునీత లాయర్ సమర్థించమేంటని ఎంపీ అవినాష్‌రెడ్డి లాయర్ ప్రశ్నించారు. దస్తగిరిని సమర్థించాననడం అర్థరహితమని సునీత లాయర్ జవాబిచ్చారు. వివేకానందరెడ్డి హత్య కేసుతో సంబంధమున్న ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరిలను వదిలేశారని అవినాష్‌రెడ్డి లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హంతకుల్ని వదిలేసి.. వైఎస్ భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి వెంటబడ్డారని తెలిపారు. వాదనలు సీరియస్‌గా సాగుతున్న సమయంలో జోక్యం చేసుకున్న కోర్టు.. అసలు వివేకా హత్యకు కారణాలేంటని ప్రశ్నించింది. దీనిపై స్పందించిన అవినాష్‌రెడ్డి న్యాయవాది.. నాలుగు కారణాలు ఉన్నాయని వెల్లడించారు.
ఒకటి వివేకా రెండో భార్యతో సునీతకు గొడవలున్నాయని.. రెండోది వ్యాపార లావాదేవీల్లో గంగిరెడ్డితో విబేధాలున్నాయని అవినాష్‌రెడ్డి లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మూడోది సునీల్ యాదవ్ కుటుంబంతో వివాదం ఉందని.. నాలుగోది రాజకీయ కారణాలు కూడా హత్యకు కారణం కావొచ్చని అవినాష్‌రెడ్డి లాయర్ న్యాయస్థానానికి తెలిపారు. మూడేళ్ల తర్వాత దస్తగిరి స్టేట్‌మెంట్‌తో ఎంపీ అవినాష్‌రెడ్డిని వేధించడమేంటని అవినాష్‌రెడ్డి లాయర్ ప్రశ్నించారు. వివేకా హత్య సమాచారం మొదట తెలిసింది సునీత భర్త తమ్ముడికేనని…ఆ కోణంలో సీబీఐ ఎందుకు దర్యాప్తు జరపడం లేదని అవినాష్‌రెడ్డి లాయర్ కోర్టు తెలిపారు. కాగా, వివేకా హత్య కేసు దర్యాప్తును ఎప్పటిలోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు చెప్పిందని సీబీఐని ప్రశ్నించింది హైకోర్టు. ఈ నెల 30లోగా పూర్తి చేయాలని సీబీఐ సమాధానం ఇచ్చింది. ఈ కేసులో ఇంకా డాక్యుమెంట్స్ సేకరించాల్సి ఉందన్న సీబీఐ.. ఇంకొంత మందిని విచారించాల్సి ఉందని కోర్టుకు తెలిపింది. వివేకా హత్య వెనుక వ్యాపార లావాదేవీలు, కుటుంబ తగాదాలు లేవన్న సీబీఐ… దస్తగిరి స్టేట్‌మెంట్‌ను ఏపీ హైకోర్టు, సుప్రీం సమర్థించిన విషయాన్ని తెలంగాణ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. మరోవైపు వివేకా హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ భాస్కర్‌రెడ్డి, ఉదయ కుమార్‌రెడ్డిని ఆరు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. చంచల్‌గూడ జైల్లో ఉన్న ఇద్దరు నిందితులను ఇవాళ్టి నుంచి విచారించనున్నారు. భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డితో కలిపి అవినాష్‌రెడ్డిని ప్రశ్నిస్తామని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు.