కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లక్షలాది మంది పేద, అసంఘటిత కార్మికులు పదవీ విరమణ తర్వాత కూడా హామీ ఇవ్వబడిన నెలవారీ పెన్షన్‌ను అందుకుంటారు. అటల్ పెన్షన్ యోజన (APY) ను 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రమోషనల్, అభివృద్ధి కార్యకలాపాలు మరియు గ్యాప్ ఫండింగ్ కోసం నిధుల మద్దతును విస్తరించడానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అసంఘటిత రంగంలోని కార్మికులకు వృద్ధాప్య ఆదాయ భద్రత కల్పించే లక్ష్యంతో APY ని మే 9, 2015న ప్రారంభించారు. జనవరి 19, 2026 నాటికి, 8.66 కోట్లకు పైగా చందాదారులు APY కింద నమోదు చేసుకున్నారు.
Also Read:Telangana: రాష్ట్రంలో రూ.6 వేల కోట్లతో రియాక్టర్ విద్యుత్ ప్లాంట్
ఈ పథకం 2030-31 వరకు కొనసాగుతుందని, అసంఘటిత కార్మికులలో అవగాహన, సామర్థ్య నిర్మాణం వంటి వాటిని విస్తరించడానికి ప్రభుత్వ మద్దతుతో ప్రచారం, అభివృద్ధి కార్యకలాపాలకు మద్దతు లభిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం తర్వాత అధికారిక ప్రకటన వెల్లడైంది. APY 60 సంవత్సరాల వయస్సు నుండి నెలకు రూ. 1,000 నుండి రూ. 5,000 వరకు కనీస పెన్షన్‌ను అందిస్తుంది. ఇది కాంట్రిబ్యూషన్ ఆధారంగా అందిస్తారు.
అటల్ పెన్షన్ యోజన కింద, మీరు, మీ జీవిత భాగస్వామి ఇద్దరూ చెరో రూ. 5000 పెన్షన్ పొందవచ్చు. మొత్తంగా, మీకు రూ. 10,000 పెన్షన్ లభిస్తుంది. ఈ పథకానికి 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకంలో నెలకు రూ. 420 చెల్లిస్తే భార్యాభర్తలిద్దరు నెలకు రూ. 10 వేలు పొందొచ్చు. ఈ పథకంలో చేరి పెట్టుబడి పెడితే.. 60ఏళ్ల తర్వాత పెట్టిన పెట్టుబడిపై ఆదారపడి ప్రతి నెల పెన్షన్ రూపంలో ఆదాయం సమకూరుతుంది. అయితే ఈ స్కీమ్ లో చేరే వ్యక్తుల వయసును బట్టి చెల్లించే మొత్తం మారుతూ ఉంటుంది.
పెట్టిన పెట్టుబడిపై 60 ఏళ్ల తర్వాత నెలకు రూ. 1000, రూ. 2000, రూ. 3 వేలు, 4 వేలు, గరిష్టంగా రూ. 5 వేల వరకు పెన్షన్ పొందొచ్చు. ఉదాహరణకు 18 ఏళ్ల వ్యక్తి ఈ స్కీమ్ లో చేరితే నెలకు రూ. 42 నుంచి గరిష్టంగా రూ. 210 వరకు చెల్లించాలి. ఒక వేళ నెలకు రూ. 210 చెల్లించాలనుకుంటే.. రోజుకు రూ. 7 ఆదా చేస్తే చాలు. 60ఏళ్లు నిండిన తర్వాత రూ. 5 వేల పెన్షన్ అందుకోవచ్చు. భార్యాభర్తలిద్దరు చేరితే అప్పుడు రోజుకు రూ. 14 ఆదా చేసి నెలకు రూ. 420 చెల్లిస్తే చాలు. అప్పుడు దంపతులిద్దరికీ కలిపి నెలకు రూ. 10 వేల వరకు పెన్షన్ వస్తుంది.
ఇక ఈ అటల్ పెన్షన్ స్కీంలో అకౌంట్ ఓపెన్ చేసేందుకు ఆన్ లైన్ లో చేసుకోవచ్చు. లేదా బ్యాంకుల్లో ఖాతా ఓపెన్ చేయొచ్చు. అటల్ పెన్షన్ యోజన స్కీంలో ఇన్వెస్ట్ చేయదలిచిన వారికి పోస్టాఫీస్ లేదా ప్రభుత్వ రంగ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉండాలి. నేషనల్ పెన్షన్ స్కీం పరిధిలోకి వచ్చేవారు అనర్హులు. ఆదాయ పన్ను చెల్లింపుదారులు కూడా ఈ పథకానికి అర్హులు కారు.