రేపు ఖమ్మంలో జరగనున్న బీఆర్‌ఎస్ పార్టీ తొలి బహిరంగ సభ చరిత్రలో నిలిచిపోనున్నది. ఈ సభ నుంచి బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్ దేశానికి దిశానిర్దేశం చేయనున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేసింది బీఆర్ఎస్ పార్టీ.. సువిశాలమయిన సభా ప్రాంగణం.. సభకు వచ్చేవారికి ఎక్కడా అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 18న ఖమ్మంలో తలపెట్టిన బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభ ఏర్పాట్లను రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, శాసనమండలి సభ్యులు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్‌తో కలిసి పరిశీలించారు. ఖమ్మం సభకు సర్వం సిద్ధమని, ఈ సభకు హాజరయ్యే తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, రాష్ట్రాల ప్రజానీకానికి అలాంటి అవాంతరాలు ఎదురు కాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు.
ఈ సభతో దేశ రాజకీయాలు మలుపు తిరుగుతాయని బీఆర్‌ఎస్ నేతలు ధీమాతో వున్నారు. బీఆర్‌ఎస్ పార్టీగా అవవతరించిన తర్వాత నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ కావడంతో ఏర్పాట్లు భారీగా ఉండేలా చూసుకుంటున్నారు. ఢిల్లీ నుంచి సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, సీపీఐ నేత రాజా హైదరాబాద్ చేరుకున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే బీఆర్‌ఎస్ నేతలు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే.. ఖమ్మం సభ బాధ్యతలను హరీష్‌రావుకు అప్పగించడంతో ఆయన ఖమ్మంలో సమావేశాలు నిర్వహిస్తూ బీఆర్‌ఎస్ నేతలతో ముచ్చటించారు.
సభా వేదిక ఎదుట 20 వేల కుర్చీలు వీఐపీల కోసం ఏర్పాటు చేస్తున్నారు. మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణం లోపల, బయటా సుమారు అతిపెద్ద 50 ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. సభకు వచ్చిన వారి కోసం పది లక్షల మంచి నీటి ప్యాకెట్లు, వెయ్యి మంది వాలంటీర్లు అందుబాటులో ఉంటారని నేతలు చెబుతున్నారు. సభ నేపథ్యంలో ఖమ్మం నగరమంతా ఇప్పటికే గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి.
మరోవైపు కాకతీయ హోటల్ కి చేరుకున్నారు కేరళ సీఎం పినరయి విజయన్. కేరళ సీఎం ను ఎయిర్ పోర్టులో రిసీవ్ చేసుకున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. సభ ఏర్పాట్ల గురించి ఆయనకు వివరించారు.