హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసం సమీపంలో క్షుద్రపూజలు అంటూ ఓ వార్త కలకలం రేపుతుంది. కేసీఆర్ ఇంటికి సమీపంలోని ఖాళీ ప్లాట్‌లో మంగళవారం నాడు మధ్యాహ్నం ముగ్గు మధ్యలో ఒక బొమ్మకు పసుపు కుంకుమ చల్లి ఎర్రటి వస్త్రంలో నిమ్మకాయలు, మిరపకాయలు ఇతర సామగ్రిని గుర్తించిన స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం నందినగర్ బస్తీలో వ్యాపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బంజారాహిల్స్ పోలీసులు అక్కడకు చేరుకుని ఈ క్షుద్ర పూజలపై విచారణ చేస్తున్నారు.
Read Also: PM Modi : శ్రీరామనవమి సందర్భంగా స్పెషల్ ట్వీట్ చేసిన ప్రధాని మోడీ.. ఏమన్నారంటే ?
ఇక, సోమవారం నాడు అర్ధరాత్రి కొంత మంది యువకులు ఖాళీ స్థలంలో కనిపించారని స్థానిక ప్రజలు చెప్పుకొచ్చారు. ఇది ఎవరైనా అకతాయిల పని కావొచ్చని మరి కొందరు తెలిపారు. ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేపట్టి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు సీసీ కెమెరాలను స్వాధీనం చేసుకుని వాటిని పరిశీలిస్తూ విచారణ చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం కేసీఆర్ ఎర్రవెళ్లి ఫామ్ హౌస్ లో ఉన్నట్లు సమాచారం. అసలు ఇంటి సమీపంలో క్షుద్రపూజలు ఎవరు చేశారు?ఎందుకు చేశారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.