గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఎయిరిండియా విమాన ప్రమాదం వందల కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే ఈ విమానం కుప్పకూలి మంటల్లో దగ్ధమైంది. తాజాగా.. విమానం కూలిపోయిన ప్రదేశం నుంచి బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. ఓ పోలీసు అధికారి వ్యాఖ్యలను ఉటంకిస్తూ వెల్లడించింది. అయితే.. ఈ బ్లాక్ బాక్స్ విమానం ఢీకొట్టిన భవనం పైకప్పుపై లభ్యమైనట్లు తెలిసింది.
కాగా.. ఇప్పటివరకు ఈ ప్రమాదానికి గల కారణమేంటనే దానిపై స్పష్టత రాలేదు. అయినప్పటికీ.. ఈ ఘటనకు సంబంధించి కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విమానం కూలిన తర్వాత ఘటనా స్థలంలో 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో సహాయక చర్యలు అత్యంత క్లిష్టంగా మారినట్లు పేర్కొన్నారు.
బ్లాక్ బాక్స్ అంటే ఏంటి?
సాధారణంగా విమానాల్లోని బ్లాక్ బాక్స్, కంప్యూటర్ హార్డ్‌డిస్క్ వంటిదని చెప్పుకోవచ్చు. విమానంలో జరిగే ప్రతి విషయాన్ని ఇది రికార్డ్ చేసుకుంటుంది. కేవలం కాక్‌పిట్‌లోని సంభాషణలే కాకుండా రేడియో ట్రాఫిక్, సిబ్బందితో జరిపే చర్చలు, పైలట్ల అనౌన్స్‌మెంట్, పైలట్లు ప్రైవేట్‌గా జరిపే సంభాషణలను సైతం రికార్డ్ చేస్తుంది. విమాన వేగం, ఎత్తు, ఇంజిన్ థ్రస్ట్ మొదలైన విమాన డేటాను అందిస్తుంది. విమానం బయలు దేరినప్పటి నుంచి ల్యాండ్ అయ్యేదాక ప్రతీది ఇందులో రికార్డ్ అవుతుంది.