Election Results: ఈశాన్య భారతంలో కాషాయ జెండా మరోసారి రెపరెపలాడింది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మూడు రాష్ట్రాల్లో బీజేపీ సత్తా చాటింది. బీజేపీ.. త్రిపురలో రెండో సారి అధికారంలోకి రాగా.. నాగాలాండ్‌లో బీజేపీ-ఎన్డీపీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక, మేఘాలయలో ఎన్‌పీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. రాత్రి 7 గంటలకు ఢిల్లీ బీజేపీ ఆఫీసుకు ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. మూడు రాష్ట్రాల విక్టరీ వేడుకల్లో మోదీ పాల్గొననున్నారు.
త్రిపురలో బీజేపీ వరుసగా రెండో సారి కాషాయ జెండాను రెపరెపలాడించింది. బీజేపీ-ఐపీఎఫ్టీ కూటమి సర్కారు ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజారిటీ సాధించింది. బీజేపీ కూటమి త్రిపురలో 33 స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేందుకు మెజారిటీని సాధించింది. పొత్తుతో బరిలోకి దిగిన కాంగ్రెస్-వామపక్ష కూటమికి ఈ ఎన్నికల్లో కూడా ఎదురుదెబ్బతింది. అనుహ్యంగా ఎన్నికల బరిలోకి దిగిన టిప్రా మోతా పార్టీ చెప్పుకోదగ్గ స్థానాలు దక్కించుకుని రాష్ట్రంలో సత్తా చాటింది. త్రిపురలో బీజేపీ విజయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహా కృషి చాలా ఉందని పార్టీ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోసారి ముఖ్యమంత్రి పీఠం మాణిక్ సాహానే వరించనున్నట్లు తెలుస్తోంది. 2018లో మూడు దశాబ్దాల వామపక్షాల పాలనకు చరమగీతం పాడి అధికారంలోకి వచ్చిన బీజేపీ ముఖ్యమంత్రి పీఠాన్ని బిప్లవ్ కుమార్ దేవ్‌కు అప్పగించింది. ఆయన వివాదస్పద వ్యాఖ్యలు, శాంతి భద్రతలు నెలకొల్పడంలో విఫలమయ్యారు. దీంతో ఆయనను తప్పించి బీజేపీ అధిష్ఠానం మాణిక్ సాహాను 2022లో ముఖ్యమంత్రి పదవిని అప్పగించింది. అలాగే బిప్లవ్ దేవ్‌ను తొలగించిన తర్వాత పార్టీని మాణిక్ సాహా పార్టీలో ఉన్న అసమ్మతిని చక్కదిద్దారు.
Read Also: Nagaland: నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్ర సృష్టించిన మహిళా అభ్యర్థి
నాగాలాండ్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ)- నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ(ఎన్డీపీపీ) సంకీర్ణ ప్రభుత్వం మరోసారి ఆ రాష్ట్రంలో పాగా వేయడం ఖాయమైంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన ఆధిక్యాన్ని అధికార కూటమి దక్కించుకుంది. 60 అసెంబ్లీ స్థానాలున్న నాగాలాండ్‌లో ఇప్పటికే ఒక సీటు ఏకగ్రీవం కాగా.. మిగతా 59 స్థానాలకు గానూ 183 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నాగా ఓటర్లు ఫిబ్రవరి 27న బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. బీజేపీ- ఎన్‌డీపీపీలు 37 స్థానాలను గెలుచుకుని స్పష్టమైన మెజారిటీని సాధించారు.