భద్రాద్రి ముక్కోటి ఏకాదశి పండుగకు సిద్ధం అవుతోంది. భద్రాచలం పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సీతారామ చంద్రస్వామి దివ్యక్షేత్రం లో ముక్కోటి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. డిసెంబర్ 23 నుంచి జనవరి 12 వరకు వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలతో పాటుగా జనవరి 1, 2వ తేదీల్లో జరగబోయే ముఖ్య ఘట్టమైన తెప్పోత్సవం, ఉత్తరద్వార దర్శన వేడుకలకు రాములోరి దివ్యక్షేత్రం అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. ముక్కోటి సందర్భంగా జరిగే ఈ వేడుకలను వైభవోపేతంగా జరిపేందుకు దేవస్థానం ఆధ్వర్యంలో సుమారు కోటి రూపాయలకు పైగా సొమ్ముతో ఏర్పాట్లు చేయనున్నారు.
వీటికి సంబంధించిన అనేక పనులు చకాచకా సాగుతున్నాయి. ఉత్తర ద్వారం వద్ద, ఫైర్ స్టేషన్ వద్ద స్వాగత ద్వారానికి, కరకట్టకు దిగువన రామయణ ఇతివృత్త బొమ్మలలకు రంగులు వేసే పనులు పూర్తి కావొచ్చాయి. చిత్రకూట మండపం వద్ద నూతనంగా అభివృద్ధి పనులు చేపట్టారు. పాత గోశాల నిర్మాణం వద్ద, చిత్రకూట మండపం పక్కన దారిలో ఇరువైపులా భక్తులకు రామాయణ ఇతివృత్తాల చిత్రాలతో స్వాగతం పలికే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు.
Read Also: వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితా ఇదిగో
అంతే గాక నిత్యాన్నదాన సత్రంలో ఫ్లోరింగ్ పనులు వేగవంతంగా నడుస్తున్నాయి. పట్టణంలోనికి ప్రవేశించే పార్కు వద్ద, సూపర్ బజార్ సెంటర్, చర్ల, కూనవరం రోడ్లలో తాత్కాలిక స్వాగత ద్వారాల పనులు, రామాలయానికి లైటింగ్, తాత్కాలిక వసతి పనులు ప్రారంభం కావాల్సి ఉంది. ఇదిలా ఉండగా గోదావరిలో తెప్పోత్సవానికి వినియోగించే హంస వాహనం తయారీ పనులు శుక్రవారం ప్రారంభించారు. ఇక స్వామి వారి అవతారాలను భక్తులుపగల్ పత్తు ఉత్సవాల్లో దర్శించుకునేందుకు మిథిలా స్టేడియంలో ప్రత్యేక వేదికను సిద్ధం చేయనున్నారు. కోవిడ్ కారణంగా రెండేళ్లుగా వేదికను ఏర్పాటు చేయకపోగా, దీనికి సంబంధించిన వేదిక పనులు ప్రారంభం కావాల్సి ఉంది. భక్తులు వీక్షించే సెక్టార్లలో బారికేడ్ల ఎత్తును పెంచుతున్నారు. సెక్టార్ల విభజన, వాటి బారికేడ్లకు సంబంధించిన పనులు ప్రారంభం కావాల్సి ఉంది. ఈ పనులను దేవస్థానం ఈఓ శివాజీ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ అధికారి రవీందర్ పర్యవేక్షిస్తున్నారు.
అంతేకాక ముక్కోటి ఉత్సవాలకు ప్రత్యేక అధికారిగా కూరాకుల జ్యోతిని నియమిస్తూ దేవాదాయ శాఖ ఇటివలే ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ గా హైదరాబాద్ లో విధులు నిర్వర్తిస్తున్న ఆమె కొద్ది రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటికే కలెక్టర్ అనుదీప్ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో జిల్లా స్థాయి, జిల్లా అడిషనల్ కలెక్టర్ కె.వెంకటేశ్వర్లు, ఆర్డీఓ రత్న కళ్యాణి ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశాలు జరిపి సలహాలు, సూచనలను అందచేశారు.
ఈ విషయమై దేవస్థానం కార్యనిర్వహణ అధికారి బి శివాజీ మాట్లాడుతూ ముక్కోటి అధ్యయనోత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, ఇప్పటికే ఆన్లైన్లో టికెట్ల విక్రయం ప్రారంభమైందని, ఐదు కౌంటర్లను ఏర్పాటు చేసి నేరుగా టికెట్లను విక్రయిస్తున్నామని తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉన్నామని తెలియజేశారు.
Read Also: Mahesh Babu : మహేశ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది