కామారెడ్డి జిల్లా కేంద్రం మాస్టర్ ప్లాన్ విషయంలో ప్రభుత్వ మూర్ఖ వైఖరికి ఒక రైతు బలి కావడం బాధాకరమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కామారెడ్డి జిల్లా అడ్లూరు ఎల్లారెడ్డికి చెందిన రైతు పయ్యావుల రాములుది ఆత్మహత్య కాదు, అది ప్రభుత్వ హత్య అని ఆయన ఆరోపించారు. నిన్న రైతు మృతదేహం తరలింపు విషయం లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ బీఆర్‌ఎస్ ప్రభుత్వం శాశ్వతమని జిల్లా కలెక్టర్, పోలీసులు భావించకూడదన్నారు. మీరు చట్టబద్ధంగా వ్యవహరించకపోతే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. గత నెల రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు ఇవాళ కలెక్టర్ ను కలిసి వినతిపత్రం ఇవ్వడానికి వెళితే పోలీసులు అడ్డుకోవడం అప్రజా స్వామీకమన్నారు.
Also Read : Thalapathy Vijay: షాకింగ్.. భార్యకు విజయ్ విడాకులు..?
బారికేడ్లు, కంచెవేసి రైతుల్ని అడ్డుకోవడం సిగ్గుచేటని, ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని ఉగ్రవాదులుగా, సంఘవిద్రోహ శక్తులు గా పరిగణిస్తోందన్నారు. ఈ ప్రభుత్వంలో సీఎం కు ఎవరినీ కలిసే తీరిక లేదు, కనీసం జిల్లా కలెక్టర్లకు కూడా రైతుల్ని కలిసే సమయం లేదని, పట్టణానికి మాస్టర్ ప్లాన్ అవసరం అనుకున్నప్పుడు ముందుగా ప్రభుత్వ భూములు, రాళ్లు రప్పల భూమిని సేకరించాలి, కానీ పంటలు పండే రైతుల వ్యవసాయ భూముల్ని లాక్కోవడం ఎంతవరకు సమంజసమన్నారు. వెంటనే కామారెడ్డి జిల్లా కలెక్టర్‌తో పాటు రాష్ట్ర మంత్రులు రైతులతో చర్చలు జరపాలన్నారు. మాస్టర్ ప్లాన్ లోని ఇండస్ట్రియల్ జోన్, గ్రీన్ జోన్ విషయంలో రైతులతో చర్చించి అవసరమైన మార్పులు చేయాలని, మాస్టర్ ప్లాన్ అలైన్ మెంట్ మార్చకుండా ఇట్లాగే మూర్ఖంగానే ముందుకు వెళ్తే జరగబోయే పరిణామాలకు ఈ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది అని గుర్తు చేస్తున్నానన్నారు. రైతులు చేపట్టబోయే ఆందోళనకు బీజేపీ మద్దతు కొనసాగుతుందన్నారు.