Bandi Sanjay: కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసాలకు కేరాఫ్ అడ్రస్ అని, ఆ పార్టీది ‘ఆపన్న హస్తం కాదని, భస్మాసుర హస్తమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ‘పాంచ్ న్యాయ్’ పేరుతో మళ్లీ కొత్త హామీలతో ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమైందన్నారు. తెలంగాణను 10 ఏళ్లపాటు పాలించిన కేసీఆర్ రాష్ట్రంలో రైతుల దుస్థితికి ప్రధాన కారణమన్నారు. 30 లక్షల ఎకరాల్లో పంట నష్టపోతే ఏనాడూ సాయమందించని కేసీఆర్ సిగ్గు లేకుండా రైతులపట్ల ప్రేమను ఒలకబోస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ మోసపూరిత పార్టీలేనని, రైతులు, నేతన్నల దుస్థితికి రెండు పార్టీలే కారణమని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని నేతన్నల దుస్థితికి నిరసనగా, వారిని ఆదుకోవాలనే ప్రధాన డిమాండ్‌తో ఈనెల 10న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సిరిసిల్లో ‘దీక్ష’ చేస్తున్నట్లు ప్రకటించారు. నయీం ఆస్తులపై విచారణ జరపడంతోపాటు ఆస్తులను దోచుకున్న కేసీఆర్ కుటుంబంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈరోజు మధ్యాహ్నం కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. 1980 ఏప్రిల్ 6న అటల్ బిహారీ వాజ్ పేయి, లాల్ కృష్ణ అద్వానీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీని స్థాపించారు. 2 సీట్లతో మొదలైన ప్రస్థానం మోడీ, నడ్డా నాయకత్వంలో 400 సీట్ల దిశగా పయనిస్తోందన్నారు. 2 సీట్లతో ఏం సాధిస్తారని వెక్కిరించిన పార్టీలే బీజేపీ దెబ్బకు కాలగర్భంలో కలిశాయని.. కాంగ్రెస్ సింగిల్ డిజిట్ దిశగా పతనమవుతోందన్నారు.
Read Also: Hit and Run: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై హిట్ అండ్ రన్.. ఇద్దరు యువకులు మృతి..
చిట్ట చివరి పేదవాడి వరకు ప్రభుత్వ పథకాలు అందించాలనే పండిట్ దీన్ దయాళ్ అంత్యోదయ సిద్దాంతాలను అమలు చేస్తున్న ప్రభుత్వం మోడీదేనని ఆయన తెలిపారు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ ప్రజలకు స్వాతంత్య్రం అందించారని.. అయోధ్య రామ మందిర నిర్మాణం, ట్రిపుల్ తలాఖ్ రద్దు.. సీఏఏ బిల్లు ఆమోదం వంటి విప్లవాత్మక చర్యలు తీసుకున్నారన్నారు. మోడీ పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారని బండి సంజయ్ తెలిపారు. 4 కోట్ల ఇండ్ల నిర్మాణం, 11 కోట్ల వంట గ్యాస్ కనెక్షన్లు, 20 కోట్లకుపైగా బ్యాంకు అకౌంట్లు ఓపెన్, కోట్లాది మరుగుదొడ్ల నిర్మాణం, పేదలకు ఆయుష్మాన్ భారత్ కార్డులు వంటి అనేక పథకాల ద్వారా సంక్షేమం అందుతోందన్నారు. కరోనా వ్యాక్సిన్ తో దేశంతోపాటు ప్రపంచానికి అందించి కాపాడిన ప్రభుత్వం మోడీదే అంటూ ఆయన పేర్కొన్నారు. 10వ స్థానంలో ఉన్న భారత్‌ను 5వ స్థానానికి తీసుకొచ్చారని.. మరో మూడేళ్లలో 3వ స్థానానికి, 2047 నాటికి నెంబర్ వన్‌గా చేసి భారత్ ను విశ్వగురు తీర్చిదిద్దేందుకు మోడీ రాత్రింబవళ్లు కష్టపడుతున్నారన్నారు. నిన్న మాజీ సీఎం కేసీఆర్ ఎండిపోయిన పంటలను సందర్శించడం చాలా సంతోషమని, ఇప్పటికైనా ఆయనకు బుద్ది వచ్చినట్లుందన్నారు. రైతుల కష్టాలు తెలిసినట్లున్నయ్.. ఆయన ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు పడ్డ రైతులు ఇప్పుడు గుర్తుకొచ్చారని అన్నారు.
Read Also: Harsih Rao: బీజేపీ వాళ్ళు దీక్షలు చేయాల్సింది గల్లీలో కాదు ఢిల్లీలో..
బండి సంజయ్ మాట్లాడుతూ.. “కేసీఆర్ మళ్లీ తన భాషను స్టార్ట్ చేసిండు.. తెలంగాణ ఇయాళ అథోగతి పాలుకావడానికి ఆ భాషే కారణం. తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలించి లబ్డి పొందాలని చూస్తున్నడు.. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు.. రైతులెందుకు గుర్తుకు రాలేదు? 10 ఏళ్ల పాలనలో 30 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోతే ఏ ఒక్క రైతును ఆదుకోలే… 10 ఏళ్లలో 11 లక్షల మందికి పైగా రైతులు చచ్చిపోతే ఏ ఒక్క రైతు కుటుంబాన్ని పరామర్శించలే… లక్ష రుణమాఫీ అమలు చేస్తానని చేయలే… కౌలు రైతులకు నయాపైసా సాయం చేయలే. వ్యవసాయ కూలీల ఉసే ఎత్తలే… కేసీఆర్ ముగ్దుంపూర్ వచ్చి పంటలను చూసిండు.. కానీ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో పంట తీవ్రంగా నష్టపోయిన చర్లబూత్కుర్, ఎలబోతారం, ఇరుకుల్ల, చామనపల్లి గ్రామాల్లో పంట నష్టం జరిగింది. ఇల్లంతకుంట, వీణవంకసహా అనేక మండలాల్లో పంట నష్టం జరిగింది. వాళ్లను ఎందుకు పరామర్శించలేదు? పోయినసారి వడగండ్ల వానలతో రామడుగు మండలం లక్ష్మీపూర్ వచ్చి ఎకరాకు రూ.10 వేలు విడుదల చేస్తానని హామీ ఇచ్చి ఎందుకు మాట తప్పినవ్. సిరిసిల్లలో వడ్ల కుప్పలపై రైతులు గుండెపగిలి చచ్చిపోయారు. ఎందుకు సాయం చేయలేదు? నీ ప్రభుత్వ హయాంలోనే రైతులకు బేడీలు వేసి జైలుకు పంపింది నిజం కాదా? వరి వేస్తే ఉరే గతి అని రైతుల బతుకులు బర్బాద్ చేసింది నిజం కాదా? ఫసల్ బీమా పథకం పనికిరాదంటివి… మరి సమగ్ర పంటల బీమా పథకాన్ని ఎందుకు అమలు చేయలేకపోయినవ్? రూ.లక్ష రుణమాఫీ చేస్తానని మాట తప్పడంవల్ల రైతులను డిఫాల్టర్లుగా మార్చిన చరిత్ర కేసీఆర్ దే. మనిషిని చంపినోడే.. అయ్యా పాపమంటూ ఆ ఫోటోకు దండేసి దండం పెట్టినట్లుంది కేసీఆర్ తీరు… ఇయాళ తెలంగాణలో రైతుల చావులకు, నష్టాలకు ముమ్మాటికీ కారకుడివి నువ్వే.. అట్లిం నువ్వే నిన్న వచ్చి రైతులను పరామర్శిస్తుంటే… ఏమన్పిస్తోందో తెలుసా?… నువ్వు మనిషిని చంపేసి… అయ్యో పాపం అంటూ ఆ మనిషి ఫొటోకు దండం పెట్టి దండేసినట్లుంది.” అని ఆయన పేర్కొన్నారు.
Read Also: Congress: లోక్‌సభ అభ్యర్థుల మరో జాబితా విడుదల
“నేనడుగుతున్నా… మీ హయాంలో అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఏనాడైనా ఆదుకున్నారా?… పోయినేడాది మార్చిలో చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం లక్ష్మీపూర్ వచ్చినవ్. వారం రోజుల్లో నష్టపోయిన రైతులందరికీ ఎకరానికి 10 వేలు ఇస్తానని ప్రకటన చేసింది నిజం కాదా? వాళ్లకు పైసలెందుకియ్యలే.. ఫసల్ బీమా యోజన పథకం పనికిరాదంటివి… సమగ్ర పంటల బీమా పథకాన్ని తీసుకొస్తానని గొప్పలు చెబితివి. పదేళ్లు అవకాశమిచ్చినా ఎందుకు తీసుకురాలేదు? వడ్లు కొనే నాధుడు లేక వడ్ల కుప్పలపైనే రైతులు గుండెలు పగిలి చనిపోతుంటే కనీసం పరామర్శించని రాక్షసుడివి నువ్వు రైతుల పట్ల ప్రేమ ఒలకపోస్తుంటే… నీ పార్టీ కార్యకర్తలే ఫక్కున నవ్వుకుంటున్నరు.. నీ పాలనలో రైతులు బాగుపడితే…రాష్ట్రవ్యాప్తంగా 11 వేల మందికి పైగా రైతులు బలవన్మరణాలకు ఎందుకు పాల్పడ్డారో సమాధానం చెప్పగలవా? నువ్వు నిజంగా సాగునీటి ప్రాజెక్టులు కట్టి లక్షల ఎకరాలకు నీళ్లిస్తే నీ పాలనలో తెలంగాణలో రైతుల బోరు బావుల సంఖ్య 18 లక్షల నుండి 28 లక్షలకు ఎందుకు పెరిగిందో సమాధానం చెప్పే దమ్ముందా? కాళేశ్వరంసహా నీ హయాంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులన్నీ నీ కుటుంబానికి ఏటీఎంగా మారింది నిజం కాదా?” అని బండి సంజయ్ ప్రశ్నించారు.