Bandi Sanjay: బీజేపీ అనేది పెద్ద కుటుంబం.. కుటుంబం అన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు. తనకు కల్మషం ఉండదని, ఎవరి మీద కోపం ఉండదని.. ఎవరితో తనకు అభిప్రాయ భేదాలు లేవని ఆయన తెలిపారు. పార్టీలో ఉంటూ పార్టీ కోసం పని చేయక పోతే కన్నా తల్లికి ద్రోహం చేసినట్టేనన్నారు. తన వల్లనే పార్టీ ఉందని ఎప్పుడు చెప్పుకోలేదన్న ఆయన.. బండి సంజయ్ ఉన్న లేకున్నా పార్టీ ఉంటుందన్నారు. మా నాయకుల మీద కామెంట్ చేసే అంత సంస్కార హీనున్ని కాదన్నారు. పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు టికెట్ ఇవ్వాలన్నారు.
తాను కూడా అవమానాలకు గురయ్యానని.. కార్యకర్తలకి అన్యాయం జరిగితే ప్రశ్నించే వ్యక్తిని అంటూ ఆయన తెలిపారు. చాలా మంది పోటీ చేసిన వారు పార్టీనీ వదిలి వెళ్ళిపోయారు .. దీంతో కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారన్నారు.బీజేపీ కార్యకర్తల మీద కేసులు పెట్టించిన వారిని, కార్యకర్తలను రాచి రంపాన పెట్టిన వారినీ పార్టీలో చేర్చుకోవడాన్ని వ్యతిరేకిస్తానని, అడ్డుకుంటానని బండి సంజయ్ తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్‌కు12 వేల కోట్ల ప్రాజెక్ట్‌లు తీసుకొచ్చానని వెల్లడించారు. వినోద్ కుమార్‌ను ఆయన పార్టీ కార్యకర్తలే గుర్తు పట్టరన్నారు. గత ఎంపీ కరీంనగర్‌కు చేసిందేమీ లేదని, అయన చేసి ఉంటే లక్ష ఓట్లతో నన్ను ఎలా గెలిపించారన్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి పోటీ చేయాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నారన్నారు.
అసెంబ్లీలో కాంగ్రెస్ కు ఓటు వేసి తప్పు చేశామని ప్రజలు భావిస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం అవుతోందని ఆయన అన్నారు. ఎన్నికల కోడ్ వచ్చిందని తాము హమీల్ని అమలు చేయలేక పోతున్నామని కాంగ్రెస్ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. 6 గ్యారంటీలు అమలు చేస్తేనే ఆ పార్టీకి ప్రజలు ఓటు వేస్తారన్నారు. పార్లమెంట్ ఎన్నికలు తన పాలనకు రెఫరెండం అని రేవంత్ అనడం స్వాగతిస్తున్నానన్నారు.