ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ కారు డ్రైవర్ తనకు సైడ్ ఇవ్వలేదన్న కారణంతో తండ్రి వయసున్న ఆర్టీసీ డ్రైవర్ పై దారుణంగా దాడికి పాల్పడిన ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ కారు డ్రైవర్ తీరుపై ప్రజలు మండిపడ్డారు. ఆర్టీసీ డ్రైవర్ ఫిర్యాదుతో ఆ కారు డ్రైవర్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ ఘటన మరవకముందే మళ్లీ ఇదే జిల్లాలో తన బైకుకు సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్ పై దాడికి యత్నించాడు ఓ వ్యక్తి. మద్యం మత్తులో వేములవాడ డిపో కు చెందిన బస్సు డ్రైవర్ కండక్టర్ పై దాడికి యత్నించాడు ఆ వ్యక్తి.
Also Read:Indigo Crisis: ఇండిగో సంక్షోభంపై కేంద్రం ఆగ్రహం.. ప్రయాణికులకు రీఫండ్ చెల్లించాలి
వేములవాడ పట్టణంలోని బ్రిడ్జి వద్ద మూర్తి రెడ్డి అనే వ్యక్తి తన బైక్‌కు సైడ్ ఇవ్వలేదన్న చిన్న కారణంతో మద్యం మత్తులో వేములవాడ డిపోకు చెందిన బస్సు డ్రైవర్, కండక్టర్‌లపై దుర్భాషలాడుతూ దాడికి దిగేందుకు ప్రయత్నించాడు. ప్రయాణికుల ముందే బూతులు తిడుతూ నానా హంగామా సృష్టించాడు. ఘటన సమయంలో డ్రైవర్ తో పాటు స్థానికులు వీడియోలు రికార్డ్ చేయగా అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు విచారణ చేపట్టి, వీడియోలను ఆధారంగా తీసుకొని చర్యలకు సిద్ధమయ్యారు. డ్రైవర్లు, కండక్టర్ల భద్రతను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కూడా కోరుతున్నారు.
గత 15 రోజుల క్రితం ఇదే జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన ఘటన మరవకముందే మరోక ఘటన చోటు చేసుకోవడంతో ఆర్టీసీ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ప్రమాదాలను అతిక్రమిస్తూ, ప్రజలను భద్రంగా గమ్యస్థానాలకు చేర్చే తమపై వరుస దాడులు జరగడం ఆందోళన కలిగిస్తుందని ఆర్టీసీ సిబ్బంది వాపోతున్నారు.