ఆసియా కప్ 2025 మరికొన్ని గంటల్లో యూఏఈలో ఆరంభం కానుంది. సెప్టెంబర్ 10న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్ తన మొదటి మ్యాచ్ యూఏఈతో ఆడనుంది. టోర్నీ కోసం టీమిండియా ప్లేయర్స్ గత వారం రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆసియా కప్‌లో పాల్గొనే 8 దేశాల కెప్టెన్లు సోమవారం విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తమ సన్నద్ధత గురించి ప్రెస్ మీట్లో మాట్లాడాడు. ప్రెస్ మీట్లో సూర్యకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురవగా.. తనదైన శైలిలో బదులిచ్చాడు. దాంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా ఆహ్లాదకరంగా మారింది.
2025 ఆసియా కప్‌లో ఫేవరెట్ భారత్ కదా అని సూర్యకుమార్ యాదవ్‌ను ఓ రిపోర్టర్ అడిగాడు. ‘భారత్ ఫేవరెట్ అని ఎవరన్నారు?. నేను ఎక్కడా వినలేదే. మేం అయితే టోర్నీలో పూర్తి సన్నద్ధతతో బరిలోకి దిగుతున్నాం. మంచి ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. మా ప్లేయర్స్ అందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు’ అని సూర్యకుమార్ బదులిచ్చాడు. సూర్య సమాధానంతో అక్కడ నవ్వులు వెల్లువిరిశాయి. ఇక పాకిస్థాన్‌తో మ్యాచ్‌ల గురించి సూర్య మాట్లాడుతూ.. ‘భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరిగేటప్పుడు మైదానంలో మేం దూకుడుగా ఉంటాం. దూకుడు లేకుండా మైదానంలో అడుగుపెట్టలేం’ అని చెప్పాడు.
Also Read: Asia Cup 2025: భారత్‌తో మ్యాచ్‌కు ముందే.. పాకిస్తాన్ బౌలర్ రిటైర్మెంట్!
డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్ ఆసియా కప్‌ను నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. ఆసియా కప్‌ను టీమిండియా ఇప్పటి వరకు 8 సార్లు గెలుచుకుంది. 2023లో వన్డే ఫార్మాట్లో జరగగా భారత్ ఛాంపియన్‌గా నిలిచింది. శ్రీలంక 6 సార్లు ఛాంపియన్‌గా నిలవగా.. పాకిస్తాన్ రెండు సార్లు ట్రోఫీని గెలిచింది. సెప్టెంబర్ 10న యూఏఈతో, సెప్టెంబర్ 14న పాకిస్థాన్‌తో, సెప్టెంబర్ 19న ఒమన్‌తో భారత్ మ్యాచ్ ఆడనుంది. లీగ్ రౌండ్ తర్వాత సూపర్-ఫోర్, ఫైన్సల్ జరగనున్నాయి.