ఆసియా కప్ 2025 మరికొన్ని గంటల్లో ఆరంభం కానుంది. సెప్టెంబర్ 10న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, యూఏఈ మ్యాచ్ జరగనుంది. సెప్టెంబర్ 12న ఒమన్‌తో పాకిస్తాన్ తలపడనుంది. ఇక సెప్టెంబర్ 14న హై ఓల్టేజ్ మ్యాచ్ భారత్, పాకిస్తాన్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ బౌలర్ ఉస్మాన్ ఖాన్ షిన్వారీ రిటైర్మెంట్ ప్రకటించాడు. దాంతో 12 ఏళ్ల అతడి కెరీర్ ముగిసింది. తాజాగా ఆసిఫ్ అలీ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఆసియా కప్ ఆరంభానికి ముందే ఇద్దరు పాకిస్తాన్ ప్లేయర్స్ రిటైర్మెంట్ ప్రకటించారు.
ఉస్మాన్ షిన్వారీ 2013లో శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన వన్డే, టెస్ట్ మ్యాచ్‌లలో కూడా అరంగేట్రం చేశాడు. పాక్ తరఫున 17 వన్డేలు, 16 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఉస్మాన్.. వరుసగా 34, 13 వికెట్లు పడగొట్టాడు. డిసెంబర్ 2019లో ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్ పాకిస్తాన్ తరపున అతని చివరి మ్యాచ్ కూడా. 31 ఏళ్ల ఉస్మాన్ 12 సంవత్సరాలలో పాక్ తరఫున 34 మ్యాచ్‌లు ఆడాడు. 2018లో ఆసియా కప్‌కు ఎంపికైన వన్డే జట్టులో అతడు సభ్యుడు. శ్రీలంకతో జరిగిన రెండు వన్డేల్లో ఐదు వికెట్లు (5-34, 5-51) అతని అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన.
Also Read: Asia Cup 2025: ప్లేయింగ్ 11ను మీకు మెసేజ్ చేస్తా.. శాంసన్‌పై ప్రశ్నకు సూర్య రిప్లై!
ఉస్మాన్ షిన్వారీ 2021లో టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2019లో రావల్పిండిలో శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. వర్షం ప్రభావితమైన ఆ మ్యాచ్‌లో 15 ఓవర్లలో ఒక వికెట్ తీసుకున్నాడు. ఆ తర్వాత అతడు మరలా జట్టుకు ఎంపిక కాలేదు. 2013లో టీ20 కెరీర్‌ను ప్రారంభించిన ఉస్మాన్.. నాలుగు సంవత్సరాల తర్వాత వన్డేలో ఆడే అవకాశం లభించింది. ఆపై రెండేళ్లకు టెస్ట్ మ్యాచ్ ఆడాడు.