AP Women Commission: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.. పవన్ కల్యాణ్ వెంటనే తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని.. క్షమాపణలు చెప్పాలంటూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వాలంటీర్లు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. ఇప్పుడు పవన్ వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఈ మేరకు పవన్ కల్యాణ్‌కు నోటీసులు జారీ చేసింది మహిళా కమిషన్.. దీనిపై 10 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పవన్ వ్యాఖ్యలు ఒంటరి మహిళల గౌరవానికి భంగం కలించేలా ఉన్నాయని నోటీసుల్లో పేర్కొన్న కమిషన్.. తాను చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ ఆధారాలు ఇవ్వాలని డిమాండ్ చేసింది.
Read Also: Pushpa 2 : పుష్ప 2 లో నటించబోతున్న ఆ బాలీవుడ్ హీరో..?
ఇక, మహిళలను ఉద్ధేశించి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ.. పవన్ వ్యాఖ్యలను తప్పుబడుతూ.. మహిళా సంఘాలు, వాలంటీర్లు ఈమెయిల్స్ ద్వారా ఫిర్యాదులు చేస్తున్నారని తెలిపారు.. అందుకే ఈ వ్యవహారంలో పవన్‌కు నోటీసులు జారీ చేస్తున్నట్లు వెల్లడించారు వాసిరెడ్డి పద్మ.. వాలంటీర్లపై విషం కక్కుతున్నారని, అసలు ఏ ఇంటెలిజెన్స్ అధికార చెప్పారో పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలని నిలదీశారు. ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసి పవన్ తప్పించుకోలేరని వార్నింగ్ ఇచ్చారు.. వాలంటీర్లకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందనే అనుమానం వ్యక్తం చేసిన ఆమె.. పవన్ చెప్తున్న 30 వేల మిస్సింగ్ కేసులకు లెక్క చెప్పాలని సవాల్ చేవారు.. అసలు, యువత చెడిపోవడానికి పవన్ సినిమాలే కారణమని ఆరోపించారు వాసిరెడ్డి పద్మ.