CM YS Jagan: తిరుపతి, తిరుమల పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌ను ప్రారంభించారు.. వాటితో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. ఇక, టీటీడీ ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఈరోజు తిరుపతిలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందన్నారు.. 2019లో అప్పట్లో కేవలం ఎన్నికల నిమిత్తం టెంకాయ కొట్టి.. ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి నుంచి.. ఈ నాలుగేళ్లలో ఆ ప్రాజెక్టును చెయ్యి పట్టుకుని నడిపించాం అన్నారు.. ఇవాళ ఆ శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌ను ప్రారంభించి.. తిరుపతి ప్రజలకు అంకితమిస్తున్నాం అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు..
మరోవైపు.. ఇళ్ల పట్టాల పంపిణీపై సంతోషాన్ని వ్యక్తం చేశారు సీఎం జగన్.. అన్నింటికంటే ఆనందాన్ని కలిగించే అంశం ఏంటంటే.. టీటీడీలో పని చేస్తున్న దాదాపు 6,700 మంది ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఉండాలని.. మంచి జరగాలనే తాపత్రయంతో త్వరగా అడుగులు వేశాం. రూ. 313 కోట్లు ఖర్చు చేసి.. 3,518 మందికి ఈ రోజు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని.. మరో 280 కోట్లు ఖర్చు చేసి నెల నుంచి 45 రోజుల్లో మరో 3 వేల మందికి ఇస్తాం అని హామీ ఇచ్చారు. ఏడు వేల మంది టీటీడీ ఉద్యోగుల ముఖాల్లో సంతోషం చూస్తున్నాం.. ఇది అన్నింటికి కంటే ఎక్కువ సంతోషం ఇచ్చే రోజుగా అభివర్ణించారు సీఎం వైఎస్ జగన్..
ఇక, 60 ఏళ్ల కల సీఎం జగన్ సాకారం చేశారని తెలిపారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి.. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నిర్ణయించారు. పేదల పట్ల గౌరవం ఉన్న వ్యక్తి సీఎం జగన్ అన్నారు. టీటీడీ ఉద్యోగుల సొంతింటి కల సాకారం చేశారు.. టీటీడీ ఇళ్ల పట్టాల పంపిణీ సీఎం జగన్ తీసుకున్న చారిత్రక నిర్ణయంగా పేర్కొన్నారు.. మరోవైపు.. సీఎం వైఎస్ జగన్ చొరవతోనే శ్రీనివాస సేతు ప్రాజెక్టు పూర్తయ్యిందని వెల్లడించారు భూమన కరుణాకర్‌రెడ్డి.