ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు సొంత నియోజకవర్గం కుప్పంపై సీఎం స్పెషల్ ఫోకస్ చేయనున్నారు. ‘స్వర్ణ కుప్పం’ పథకం పేరిట కుప్పం రూపురేఖలు మరింతగా మార్చనున్నారు. వచ్చే ఐదేళ్ల పాటు కుప్పం ప్రాంత సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ‘స్వర్ణ కుప్పం-విజన్ 2029’ పథకంను సీఎం ఆరంభించనున్నారు. ఆది, సోమ, మంగళవారం కుప్పంలో సీఎం చంద్రబాబు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు.
నేడు ద్రవిడ యూనివర్శిటీలో ‘స్వర్ణ కుప్పం-విజన్ 2029’ డాక్యుమెంట్ను సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు. కుప్పం నియోజకవర్గం అభివృద్ధిలో రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దడమే స్వర్ణ కుప్పం ప్రధాన లక్ష్యం. ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదల, కుప్పం ప్రాంత సమగ్ర అభివృద్ధి పథకం ప్రధాన ఉద్దేశ్యం. కుప్పం ప్రాంతంలో సుమారు మూడు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు చేశారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి కుప్పంకు మరో రెండు కొత్త డైరీలు తెచ్చేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారు. కుప్పం నియోజకవర్గ0లో సుమారు 1500 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.
స్వర్ణ కుప్పం-విజన్ 2029 విడుదల అనంతరం సోమవారం కుప్పం మండలం నడిమూరు గ్రామంలో గృహాలపై ఏర్పాటు చేసిన సోలార్ పలకల పైలట్ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. సీగలపల్లెలో ‘ఆర్గానిక్ కుప్పం’ కార్యక్రమంలో భాగంగా ప్రకృతి సేద్యం రైతులతో బాబు ముఖాముఖి కానున్నారు. రాత్రికి ఆర్ అండ్ బీ అతిథి గృహంలో బస చేస్తారు.మంగళవారం ఉదయం కుప్పం టీడీపీ కార్యాలయానికి వెళ్లి నియోజకవర్గ నేతలు, కార్యకర్తలను కలవనున్నారు. మధ్యాహ్నం కంగునూడి గ్రామంలో శ్యామన్న విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సాయంత్రం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ఇక 8వ తేదీ ఉదయం విశాలో వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి సీఎం అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.