AP CM Chandrababu: విశాఖ ఉక్కుని శాశ్వతంగా లాభాల బాట పట్టేలా కార్యాచరణ ప్రణాళిక చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విశాఖ ఉక్కు రాష్ట్రానికి సెంటిమెంటు అని, ప్రైవేటు పరం కానీయకుండా అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల బాట పట్టడానికి గత ప్రభుత్వ వైఖరి కూడా ఓ కారణమని విమర్శించారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటేజేషన్ కాకుండా.. గతంలో ఆపింది తానేనని సీఎం తెలిపారు. కేంద్ర మంత్రి కుమార స్వామితో మాట్లాడానన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కొంత డబ్బులిచ్చి ఆపరేట్ చేయడానికి ముందుకెళ్తున్నారని.. ఉద్యోగులు, కార్మికులు కూడా ఆలోచించుకోవాలన్నారు. బెస్ట్ మేనేజ్మెంట్ పెట్టుకుని.. శాశ్వతంగా లాభాల బాట పట్టించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లన్నీ లాభాల్లో ఉంటే.. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎందుకు నష్టాల్లోకి వస్తుందో ఆలోచించాలన్నారు. ఆంధ్రుల హక్కు.. విశాఖ హక్కు అనేది నిరూపించుకోవాలంటే కష్టపడి పని చేయాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంటును కాపాడుకునేందుకు సర్వ శక్తులా ప్రయత్నిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.
Read Also: CM Chandrababu: వరద బాధితుల కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన.. నీట మునిగిన ఇళ్లకు రూ.25వేలు
గత ఐదేళ్లల్లో ఎప్పుడైనా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారా అంటూ సీఎం ప్రశ్నించారు. ఢిల్లీ వెళ్దామని నాడు సీఎంగా ఉన్నప్పుడు స్పందించారా అంటూ వ్యాఖ్యానించారు. ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్తారా అన్న ఆయన.. ఏం చెప్పినా నమ్మే రోజులు పోయాయన్నారు. కొత్త మెడికల్ కాలేజీల గురించి జగన్ ఎలాంటి జీవోలు ఇచ్చారంటూ ప్రశ్నించారు. కొత్త మెడికల్ కాలేజీల విషయంలో జగన్ ఎలాంటి జీవోలిచ్చారో చదువుకోవాలన్నారు. నిన్న వాళ్లేం చేశారో మరిచి.. ఇప్పుడు విమర్శలు చేస్తే చెల్లుతుందా అంటూ ఎద్దేవా చేశారు. ప్రజాహితం కోసం కొందరు పని చేస్తుంటే.. ప్రజలకు నష్టం కలిగించేందుకు ఇంకొందరు పని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాధితుడైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఆపరేషన్ బుడమేరు మొదలు పెడతాం.. దీని కోసం చట్టం తెస్తామని ప్రకటించారు.బుడమేరు దురాక్రమణలు తొలగించాలి.. తొలగిస్తామన్నారు. వరద ప్రాంతాల్లోని విద్యార్థులకు పుస్తకాలిస్తామని పేర్కొన్నారు. కేంద్రాన్ని వరద సాయం అడుగుతున్నాం.. వచ్చాక చెబుతామన్నారు. అమరావతి నీట మునుగుతోందని కొందరు బుద్ది జ్ఞానం ఉంటే మాట్లాడగలరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాదు, బెంగళూరు, బాంబే సిటీల పరిస్థితేంటీ..ఇంటి మీద నీళ్లొస్తే ఆకాశం మీదకు వెళ్తారా అంటూ ప్రశ్నించారు. హుదూద్ వస్తే విశాఖ ఏమైంది.. పులివెందుల్లో పెట్టాలా అంటూ ప్రశ్నలు గుప్పించారు.
Read Also: Andhra Pradesh: పీజీ వైద్య విద్యలో ఇన్‌సర్వీస్ రిజర్వేషన్‌పై రేపు చర్చలు
కర్నూలుకు వరదలు రాలేదా అంటూ ప్రశ్నించారు. నీళ్లల్లో దిగని వారు.. బురదలో దిగడానికి ఆలోచించే వాళ్లు రాజకీయాలకు పని కొస్తారా అంటూ ఎద్దేవా చేశారు. నడవలేని ముసలి వాళ్లు పెన్షన్ డబ్బులిచ్చి వరద బాధితులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎన్ని కష్టాలు ఉన్నా ముంపు బాధితులకు సాయం చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాజకీయ విద్వేషాలు ఉండే వారు తప్ప ప్రజలు అంతా ఉదారంగా స్పందించి సాయం అందిస్తున్నారని వ్యాఖ్యానించారు. 32 వార్డుల పరిధిలో మున్సిపల్ టాక్స్ గడువు కూడా మూడు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇప్పటి వరకు వరద సాయం కింద రూ. 300 కోట్లు విరాళాలిచ్చారని.. మరో రూ. 100 కోట్ల నుంచి రూ. 150 కోట్లు వరకు విరాళాలు రావచ్చని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.