CM Chandrababu: బుడమేరు వరద బెజవాడను అతలాకుతలం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం వచ్చిన విపత్తులాంటి విపత్తును గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. ఊహించని స్థాయిలో వరద రావడం.. గత ప్రభుత్వ నిర్లక్ష్యం.. బుడమేరు కబ్జాల వల్ల విపత్తు సంభవించిందని ఆయన అన్నారు. మేం అధికారంలోకి వచ్చి ఇంకా 100 రోజులు కూడా పూర్తి కాక ముందే అతి పెద్ద విపత్తు వచ్చిందని సీఎం పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజీని ఢీకొనేలా వైసీపీ నేతలు బోట్లను వదిలారని ఆయన విమర్శించారు. కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నాయి.. విరిగిపోయాయని ముఖ్యమంత్రి అన్నారు.
గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలనూ నిర్వీర్యం చేసేసిందని.. రాజధానికి నిధులే అవసరం లేదని ప్రపంచ బ్యాంక్‌కు లేఖలు రాశారని పేర్కొన్నారు. స్థానిక సంస్థలకివ్వాల్సిన ఫైనాన్స్ కమిషన్ నిధులను పక్క దారి పట్టించారని.. ఇలాంటివి ఎన్నో అరాచకాలను గత ప్రభుత్వం చేసిందని విమర్శించారు. వీటిని గాడిలో పెట్టాల్సి ఉందన్నారు. ఇవన్నీ ఉన్నా.. వరద బాధితులకు సాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వరద బాధితులు పడిన ఇబ్బందులను.. కష్టాలను ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నానని సీఎం పేర్కొన్నారు. మానవ ప్రయత్నంగా ఎంత వరకు సాయం అందించగలిగామో.. అంతా చేస్తున్నామన్నారు. సహాయక చర్యలు చేపట్టిన విధానాంపై జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందన్నారు. దాతలు కూడా పెద్ద ఎత్తున వరద సాయం అందించేందుకు ముందుకు వచ్చారని ముఖ్యమంత్రి తెలిపారు.
Read Also: AP Govt: మరో ఎన్నికల హామీ అమలు దిశగా కూటమి సర్కారు కసరత్తు
మునిగిన ఇళ్లకు రూ.25 వేలు
ఈ క్రమంలోనే వరద సాయం ప్యాకేజీని ప్రకటిస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. 179 సచివాలయాల పరిధిలో వరద సాయం అందించనున్నామని తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నవారంతా నీట మునిగారని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. నీట మునిగిన ఇళ్లకు రూ. 25 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని.. పై ఫ్లోర్సులో ఉన్న వారందరికీ రూ. 10 వేలు ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఎవ్వరి ఇళ్లు నీట మునిగినా రూ. 25 వేలు ఇస్తామని సీఎం ప్రకటించారు. వరదల్లో నష్టపోయిన చిన్న షాపుల యాజమానులకు రూ. 25 వేలు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. రూ. 40 లక్షల టర్నోవర్ కంటే తక్కువ ఉన్న MSMEలకు రూ. 50 వేలు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. రూ. 40 లక్షల నుంచి రూ. 1.50 కోట్ల టర్నోవర్ ఉన్న MSMEలకు రూ. 1 లక్ష ఆర్థిక సాయం అందిస్తామన్నారు. రూ. 1.50 కోట్ల పైన టర్నోవర్ ఉన్న MSMEలకు రూ. 1.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. 9088 టూవీలర్లు ఇన్సూరెన్స్ కోసం క్లైమ్ చేసుకున్నారు.. వీరు రూ. 71.50 కోట్లు క్లైమ్ చేసుకున్నారని సీఎం తెలిపారు. దీంట్లో 2345 వెహికల్స్ క్లైమ్స్ సెటిల్ అయ్యాయన్నారు. క్లైమ్స్ సెటిల్ అయ్యేంత వరకు వరద బాధితులకు అండగా ఉంటామన్నారు.
Read Also: Andhra Pradesh: పీజీ వైద్య విద్యలో ఇన్‌సర్వీస్ రిజర్వేషన్‌పై రేపు చర్చలు
వ్యవసాయం పంటలకు హెక్టారుకు రూ. 25 వేలు
టూవీలర్లుకు రూ. 3 వేలు, ఆటోలకు రూ. 10 వేలు, ఎంత ఖర్చైనా సరే తోపుడు బళ్లు కొత్తవి ఇస్తామన్నారు. వీవర్స్‌కు రూ. 15 వేలు ఇస్తామని, వీళ్లకి మగ్గం కూడా పోతే రూ. 25 వేలు ఇస్తామన్నారు. ఫిషింగ్ బోట్లు, వలల నష్టం జరిగితే రూ. 25 వేలు ఇస్తామని సీఎం ప్రకటించారు. పాక్షికంగా నష్టపోతే.. రూ. 10 వేలు ఇవ్వనున్నామని చెప్పారు. చేపల చెరువులు నష్టపోతే హెక్టారుకు రూ. 15 వేలు అందిస్తామన్నారు. పశువులు, కోళ్లు చనిపోతే రూ. 50 వేల నుంచి రూ. 100 వరకు ఇస్తామని ప్రకటించారు. వ్యవసాయం పంటలకు హెక్టారుకు రూ. 25 వేలు చొప్పున పంట నష్టం కింద చెల్లిస్తామన్నారు. ఇంకొన్ని రకాల పంటలకు హెక్టారుకు రూ. 15 వేలు చొప్పున పంట నష్టం అందిస్తామన్నారు. ఉద్యాన పంటల నష్టం కింద హెక్టారుకు రూ. 35 వేల, 25 వేల చొప్పున పంట నష్టం కింద చెల్లిస్తామని పేర్కొన్నారు.
చరిత్రలో వరద సాయం ఈ స్థాయిలో ఎవ్వరూ అందించ లేదని సీఎం చంద్రబాబు తెలిపారు. నీట మునిగి ఇళ్లకు.. పంట నష్టానికి పెద్ద ఎత్తున సాయం అందించనున్నామన్నారు. మూడు నెలల మారటోరియంతో, 36 నెలల్లో చెల్లింపులు జరిపేలా నీట మునిగిన ఇళ్లల్లోని బాధితులకు లోన్లు ఇవ్వాలని బ్యాంకర్లను కోరామన్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నవారికి రూ. 50 వేలు, ఫస్ట్ ఫ్లోర్, ఆ పైన ఉన్న వారికి 25 వేలు లోన్లు ఇవ్వాలని సూచించామన్నారు. దుకాణాలు, చిన్న తరహా పరిశ్రమలకు రుణాలను రీషెడ్యూల్ చేయాలని బ్యాంకర్లను కోరినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. రెండేళ్లు రుణాలపై మారటోరియం అడిగామన్నారు. మేం చేయాల్సిన సాయం చేశాం.. బ్యాంకర్లు కూడా ఏం చేయగలరో చూడాలని కోరామన్నారు. క్రాప్ లోన్లకు ఐదేళ్లు రీపేమెంట్ చేసేలా.. ఏడాది మారటోరియం విధించాలని కోరామన్నారు. టర్మ్ లోన్లను కూడా ఇన్సాటల్మెంట్ రీ-షెడ్యూల్ చేసి ఫ్రెష్ టర్మ్ లోన్లు ఇవ్వాలని కోరామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.