CM Chandrababu: గృహ నిర్మాణ శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. 2029 నాటికి అర్హులైన అందరికీ ఇళ్లు నిర్మించే లక్ష్యంతో పని చేయాలని సీఎం అన్నారు. రాష్ట్రంలో పీఎంఏవై 2.0 పథకం ప్రారంభించేందుకు కేంద్రంతో ఎంఓయూ కుదుర్చుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటయ్యాక పీఎంఏవై అర్బన్ కింద 58,578 ఇళ్లు, పీఎంఏవై గ్రామీణం కింద 17,197 ఇళ్లు నిర్మించినట్లు అధికారులు సీఎంకు వివరించారు. లక్ష ఇళ్లు డిసెంబరు నాటికి పూర్తవుతాయని, లబ్ధిదారులకు ఇంటి తాళాలు అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు.
Read Also: Minister Nadendla Manohar: బియ్యం అక్రమ రవాణా అడ్డుకట్టకు సహకరించాలి..
2026 నాటికి మరో 7.60 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. డ్రోన్ల ద్వారా ఇళ్ల నిర్మాణ నాణ్యత, మెజర్మెంట్స్ తీసుకునేందుకు గృహనిర్మాణ శాఖ పైలట్ ప్రాజెక్ట్ చేపట్టిందని అధికారులు వివరించారు. ఇదే సాంకేతికతను పెద్ద లేఅవుట్లలో కూడా వినియోగించాలని సీఎం ఆదేశించారు. ఆయా శాఖల సమన్వయంతో అన్ని లేఅవుట్‌లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని సీఎం ఆదేశించారు. 597 మందిని డిప్యుటేషన్ ద్వారా గృహ నిర్మాణ శాఖలోకి తీసుకునేందుకు తీసుకునేందుకు సీఎం అంగీకారం తెలిపారు. ఈ సమీక్షలో మంత్రి కొలుసు పార్థసారధి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.