వచ్చే నెల రెండో వారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలోని వివిధ అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉండనుంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పథకాల గురించి ప్రత్యేక చర్చలు జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పందించారు.
అసెంబ్లీ సమావేశాల్లో బనకచర్ల ప్రాజెక్టుపై కూడా ప్రత్యేక చర్చ ఉండనుందని తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన నేపథ్యంలోనే ఏడాది పాలనపై ప్రత్యేక చర్చ ఉండబోతుందని తెలుస్తోంది. అయితే అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరవుతారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. గతంలో అసెంబ్లీ సమావేశాలకు 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.
Also Read: AP Cabinet: 200 కంపెనీలకు వైసీపీ తప్పుడు ఇ-మెయిల్స్.. సీఎంకు ఆధారాలు చూపిన మంత్రి పయ్యావుల!
స్పీకర్ అయ్యన్న పాత్రుడు అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో మీడియాతో ముచ్చటించారు. ‘సెప్టెంబర్ 14, 15 తేదీల్లో తిరుపతి వేదికగా చట్టసభల జాతీయ మహిళా సాధికార సభ్యుల జాతీయ సదస్సు ఉంటుంది. ఏపీ ఆతిధ్యం ఇవ్వాలన్న పార్లమెంట్ స్పీకర్ సూచన మేరకు దీనిని నిర్వహిస్తున్నాం. దాదాపు 500 మంది ఎంపవర్‌మెంట్ ఆఫ్ ఉమెన్ కమిటీ సభ్యులు అన్ని రాష్ట్రాల నుంచి పాల్గొంటారు. ఆగస్టు మొదటి వారం లేదా రెండో వారంలో 10 రోజుల పాటు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఉంటాయి’ అని అయ్యన్న పాత్రుడు చెప్పారు.