గులాబ్ తుపాన్ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పడుతోంది. తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తుపాన్ కారణంగా రాబోయే మూడు రోజుల్లో హైదరాబాద్ నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపాను వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.
ఉమ్మడి వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. గులాబ్ తుఫాన్ కారణంగా ప్రభుత్వం అప్రమత్తమైంది. కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎస్ సోమేష్ కుమార్. ప్రతీ జిల్లాలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే తప్ప జనం ఎవరూ బయటకు వద్దని సూచిస్తున్నారు.