పశ్చిమ బెంగాల్లో హింస చెలరేగింది. శనివారం జరుగుతున్న లోక్‌సభ చివరి దశ ఎన్నికల్లో వివిధ ప్రాంతాల నుండి చెదురుమదురు హింసాత్మక ఘటనలు మళ్లీ వెలువడుతున్నాయి. ఈ క్రమంలో దక్షిణ 24 పరగణాల జిల్లా జయనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని కుల్తాలి ప్రాంతంలో ఓ ఘటన వెలుగు చూసింది. ఇక్కడి పోలింగ్ బూత్‌లో ఉదయం ఓటింగ్ ప్రారంభమైన తర్వాత అధికార తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ఉన్న కొందరు వ్యక్తులు.. స్థానిక ప్రజలను ఓటింగ్ చేయకుండా నిలిపివేశారని ఆరోపించారు. దీనికి నిరసనగా ఓటింగ్ ప్రారంభమైన 20 నిమిషాల్లోనే స్థానిక ప్రజలు ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను చెరువులో పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు గ్రామానికి చేరుకున్నారు. ఈ క్రమంలో గ్రామస్తులు పోలీసుల వాహనాలపై చెట్లు కొమ్మలు విసిరి నిరసనకు దిగారు.
AP-TG Rains: తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లని కబురు.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు..
ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సంఘటన కుల్తాలిలోని మేరీగంజ్‌లోని బూత్ నంబర్ 40, 41లో జరిగింది. తృణమూల్‌కు మద్దతిచ్చిన అక్రమార్కులు తమను ఓటు వేయకుండా అడ్డుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను తృణమూల్ కాంగ్రెస్ తోసిపుచ్చింది. అదే సమయంలో.. సెక్టార్ ఆఫీసర్ ద్వారా ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు.. ఈ సమాచారం తెలుసుకుని జైనగర్ బీజేపీ అభ్యర్థి అశోక్ కందారి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కమిషన్ ప్రతినిధులు కూడా ఘటనాస్థలానికి వచ్చారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. ఈ ఘటనకు ఎవరు పాల్పడ్డారనే దానిపై కమిషన్ విచారణ జరుపుతోంది. సంఘటన తర్వాత ప్రత్యామ్నాయ ఈవీఎంలతో బూత్‌లో మళ్లీ ఓటింగ్ ప్రారంభమైంది. చెరువులో ఈవీఎంలు విసిరిన ఘటన పంచాయతీ ఎన్నికల్లో జరిగిన హింసాకాండను తలపిస్తోంది. గత ఏడాది రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా కొన్ని చోట్ల అక్రమార్కులు బ్యాలెట్ బాక్సులను నీటిలో పడేయడం గమనార్హం.