CM Revanth: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని Analog AI కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అలెక్స్ కిప్‌మాన్ హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణను భవిష్యత్ నగరాల దిశగా తీసుకెళ్లడానికి చేపడుతున్న ఏఐ సిటీ ప్రాజెక్టు, ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ వంటి కార్యక్రమాల్లో తర్వాతి తరం ‘ఫిజికల్ ఇంటెలిజెన్స్’ సిస్టమ్‌లను ఎలా అనుసంధానించొచ్చన్నది ఈ సమావేశంలో చర్చించారు.
సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థన మేరకు Analog AI తమ ఆధునిక సాంకేతిక ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి హైదరాబాద్ నగరం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన ట్రాఫిక్ రద్దీ, పట్టణ వరదలు, వాతావరణ మార్పుల అంచనా వంటి అంశాలను పరిష్కరించడంలో సహకరించేందుకు అంగీకారాన్ని తెలిపింది. ఈ పరిష్కారాలు నగర పాలనను స్మార్టుగా మార్చడంలో కీలక పాత్ర పోషించనున్నాయని అధికారులు భావిస్తున్నారు. అదేవిధంగా రాబోయే డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’కు హాజరయ్యేలా కిప్‌మాన్‌ను ముఖ్యమంత్రి ఆహ్వానించారు.