Airplane Stuck Under Bridge: విమానం బ్రిడ్జి కింద ఇరుక్కుపోవడం ఏంటి.. అసలు విమానం రోడ్డుపై ఎందుకు ప్రయాణించాల్సి వచ్చిందని ఆశ్చర్యపోతున్నారా.. నిజమండి బాబు… విమానం రోడ్డు పై ప్రయాణిస్తూ ఉన్నట్లుండి ఓ బ్రిడ్జీ కింద ఇరుక్కుపోయింది. దీంతో ఆ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ క్లియర్ చేయడానికి అధికారులు నానావస్థలుపడాల్సి వచ్చింది. అధికారులు ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం తిప్పలు పడుతుంటే ఇలాంటి సీన్ మళ్లీ మళ్లీ చూడలేమంటూ అటుగా వెళ్తున్న ప్రయాణికులు తమ సెల్ ఫోన్లు తీసి వీడియోలు తీయడం మొదలుపెట్టారు. కొందరు అదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. ఈ ఘటన బాపట్ల జిల్లా అద్దంకి ప్రాంతంలో చోటు చేసుకుంది. తెల్లవారు జామున ట్రాలీ లారీపై వస్తున్న విమానం అండర్ పాస్ బ్రిడ్జి కింద ఇరుక్కుపోయింది.
Read Also: Beggar Donates Money: బిచ్చగాడి గొప్ప మనసు.. వేల రూపాయలు విరాళం
అసలు విషయం ఏంటంటే.. హైదరాబాద్‌కి చెందిన ప్రముఖ హోటల్ పిస్తా హౌస్ ఓ పాత విమానాన్ని కొనుగోలు చేసింది. పాత విమానాన్ని హోటల్‌గా మార్చాలనే వినూత్న ఆలోచనలో దీనిని కొనుగోలు చేసింది. కొచ్చిన్‌లో పాత విమానాన్ని కొని అక్కడే హోటల్‌గా మార్పు చేసింది. అనంతరం రెక్కలను విడదీసి ట్రాలీలో విమానాన్ని కొచ్చిన్ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తోండగా బాపట్ల జిల్లా మేదరమెట్ల బైపాస్‌లోని అండర్ పాస్ బ్రిడ్జి కింద ఇరుక్కుపోయింది. ట్రాలీ బ్రిడ్జి కింద ఇరుక్కుపోవడంతో ఆ రోడ్డులో ట్రాఫిక్ జామ్ అయింది. తర్వాత పోలీసులు వేరే మార్గానికి వాహనాలను దారి మళ్లించారు. అనంతరం విమానాన్ని జాగ్రత్తగా అండర్ పాస్ బ్రిడ్జి దాటించే ప్రయత్నం చేశారు.