Powerful earthquake shakes Afghanistan: అఫ్గానిస్థాన్‌ను భూకంపాలు అస్సలు వదలడం లేదు. మరోసారి అఫ్గాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (యుఎస్‌జీఎస్) వెల్లడించింది. పశ్చిమ అఫ్గానిస్థాన్‌లో హెరాత్ నగరానికి 34 కిలోమీటర్ల దూరంలో దాదాపు 8 కిలోమీటర్ల ఉపరితలం కింద ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. చాలా రోజుల తర్వాత ఈ ప్రాంతంలో రెండు పెద్ద ప్రకంపనలు వచ్చాయని, ఈ ప్రమాదంలో 1000 మందికి పైగా మరణించారని తెలుస్తోంది. వందల మంది ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారట.
అక్టోబర్ 7వ తేదీన అఫ్గాన్‌లోని హెరాత్ ప్రావిన్స్‌లో వచ్చిన భూకంపానికి 2 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. అఫ్గాన్ దేశ చరిత్రలోనే అత్యంత తీవ్రమైన భూకంపాల్లో ఇది కూడా ఒకటి. ఈ భూకంపంలో చనిపోయిన వారిలో 90 శాతం మంది పిల్లలు, మహిళలే ఉన్నారు యునిసెఫ్ తెలిపింది. ఈ భూకంప కేంద్రం ఉన్న జెండాజెన్ జిల్లాలో ఏకంగా 1200 మందికి పైగా మరణించారు.
Also Read: IND vs PAK: అతడిని తుది జట్టులో ఎందుకు తీసుకున్నారు.. యావరేజ్ ప్లేయర్!
అక్టోబర్ 11న మరోసారి 6.3 తీవ్రతతో అఫ్గాన్‌లో భూకంపం వచ్చింది. ఈ భూకంపం కారణంగా వందల సంఖ్యలో ఇళ్లు నేలమట్టం అయ్యాయి. పాఠశాలలు, హెల్త్ క్లీనిక్‌లు అన్ని ఈ భూకంపంలో దెబ్బతిన్నాయి. సహాయక చర్యల్లో కూడా తీవ్ర జాప్యం జరుగుతోంది. తొలిసారి భూకంపం సంభవించినప్పుడు.. బాధితులను ఆదుకోవడానికి ఎవరూ రాలేదు. స్థానికులే క్షతగాత్రులను శిథిలాల కింద నుంచి వెలికి తీశారు. గత ఏడాది జూన్‌లో పాక్టికా ప్రావిన్స్‌లో 5.9 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 1000 మందికి పైగా మరణించారు. వరుస భూకంపాలతో అఫ్గాన్ జనాలు వైకిపోతున్నారు. మరోవైపు తాలిబాన్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది.