నవ్వుల రారాజు, ప్రముఖ సినీ హాస్యనటుడు రాజబాబు 87వ జయంతి వేడుక రాజమండ్రి గోదావరి గట్టున ఉన్న రాజబాబు విగ్రహం దగ్గర ఘనంగా జరిగింది. రాజబాబు సోదరుడు బాబి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జయంతి కార్యక్రమంలో పలువురు నగర ప్రముఖులు పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు సినీ వినీలాకాశంలోఅలరారించి, విభిన్నమైన శైలితో ఓ ప్రత్యేక ముద్రవేసి ప్రేక్షకుల మదిలో చిరకాలం గుర్తుండిపోయిన నటుడు రాజబాబు అని వక్తలు కొనియాడారు.
Read Also: Renu Desai: మహేష్ తో సినిమా.. పెద్ద గొడవలు అవుతాయి
అనంతరం వక్తలు మాట్లాడుతూ.. 1936 అక్టోబరు 20న పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో పుణ్యమూర్తుల ఉమామహేశ్వరరావు, రవణమ్మ దంపతులకు రాజబాబు జన్మించారని, ఆయనకు ముగ్గురు తమ్ముళ్ళు, ఐదుగురు చెల్లెళ్ళని, రాజబాబు అసలు పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు అని పేర్కొన్నారు. రాజబాబు 1960లో సమాజం అనే చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసి 600 చిత్రాల్లో నటించి మెప్పించారని తెలిపారు. తన నటనతో వరుసగా ఏడు ఫిలింఫేర్ అవార్డులు, మూడు నంది పురస్కారాలు, మరెన్నో అవార్డులు అందుకున్నారని వక్తులు వివరించారు. ఎన్నో సంస్థలకు ఎన్నెన్నో విరాళాలు ఇచ్చిన దాత రాజబాబు అని కొనియాడారు. రాజమండ్రిలో పారిశుద్ధ్య కార్మికులకు ఉచితంగా ఇళ్ళు కట్టించి ఇచ్చారని, కోరుకొండలో జూనియర్ కాలేజి కట్టించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Read Also: Young Man Suicide: మొబైల్ కొనివ్వలేదని 20 ఏళ్ల యువకుడు ఆత్మహత్య
రాజబాబు ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా పాతతరం నటులను, నటీమణులను సత్కరించేవారు. ప్రత్యేకంగా హాస్యంలో తనకు స్ఫూర్తినిచ్చిన బాలకృష్ణ(అంజి)ని సత్కరించేవారు. సత్కారం పొందిన వారిలో జగ్గయ్య, డాక్టర్ శివరామకృష్ణయ్య, సూర్యకాంతం, రేలంగి, సావిత్రి మొదలైన వారు ఉన్నారు. తన చుట్టూ ఉన్న వారిని సదా నవ్విస్తూ, కవ్విస్తూ సాగిన రాజబాబు 1983 ఫిబ్రవరి 14న హైదరాబాద్ లో తుది శ్వాస విడిచి మన నుంచి దూరమయ్యారని సోదరుడు బాబి తెలిపారు. జయంతి కార్యక్రమంలో రాజబాబు మేనల్లుడు బీఎస్ఎన్ఎల్ వాసు, రాజబాబు మిత్ర బృందం బాబు స్టూడియో అధినేత ముసిని వెంకటేశ్వరరావు(బాబ్లూ), మల్లుల శ్రీనివాస్, బాబి, మల్లుల కిరణ్, కట్టా చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా. స్వీట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు.