Delhi: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మంత్రివర్గంలో ఇద్దరు కొత్త మంత్రులు చేరారు. ఢిల్లీ మంత్రులుగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు అతిషి, సౌరభ్ భరద్వాజ్‌లు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. అతిషి, సౌరభ్ భరద్వాజ్‌ల చేత లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు రామ్‌విర్ సింగ్ బిధూర్ హాజరయ్యారు. కేబినెట్‌లో చోటు దక్కించుకున్న అతిషికి విద్య, పీడబ్ల్యూడీ, విద్యుత్, పర్యాటక శాఖల బాధ్యతలను అప్పగించారు. సౌరభ్ భరద్వాజ్‌కు ఆరోగ్యం, పట్టణాభివృద్ధి, నీటి, పరిశ్రమల శాఖల బాధ్యతలను కేటాయించారు. ఇక, అతిషి, సౌరభ్‌లను మంత్రులకు నియమించే ప్రతిపాదనలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
వీఎస్ అతిషి కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నిర్వహించిన విద్యా బృందంలో కీలక సభ్యురాలిగా ఉన్నారు. ఆమె 2019 లోక్‌సభ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ చేతిలో ఓడిపోయారు. ఇక, భరద్వాజ్ ఆప్ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ప్రస్తుతం గ్రేటర్ కైలాష్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఢిల్లీ జల్ బోర్డులో వైస్ చైర్మన్‌గా సేవలందిస్తున్నారు. గతంలో మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.
Read Also: Shivraj Chouhan: విదేశాల్లో చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నాడు.. రాహుల్‌పై శివరాజ్ చౌహాన్ వ్యాఖ్యలు
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మనీలాండరింగ్ కేసులో జైలులో ఉన్న మంత్రి సత్యేంద్ర జైన్‌లు ఇటీవల వారి పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరో ఇద్దరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు.