Dantewada Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKSZC)కి చెందిన ఒక మహిళా మావోయిస్టుతో పాటు చాలా మంది మావోయిస్టులు మరణించారు. ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య జరిగిన కాల్పుల్లో తెలంగాణ వరంగల్ జిల్లాకు చెందిన మహిళా మావోయిస్ట్ రేణుక అలియాస్ బాను మరణించింది.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్, దంతేవాడ జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్ట్ వ్యతిరేక ఆపరేషన్‌లో భాగంగా జిల్లా రిజర్వ్ గార్డ్స్(డీఆర్జీ) ఆధ్వర్యంలో భద్రతా బలగాలు ఈ ఆపరేషన్ నిర్వహించాయి. దంతేవాడ జిల్లాలోని గీడం, బీజాపూర్‌లోని భైరమ్‌గూడ పోలీస్ స్టేషన్ సరిహద్దు గ్రామాలైన నెల్గొడ, అకేలి, బెల్నార్ ప్రాంతాల్లో ఈ ఆపరేషన్ జరిగింది. ఎన్‌కౌంటర్ స్థలం నుండి INSAS రైఫిల్ మరియు ఇతర ఆయుధ మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 2025 నుంచి ఇప్పటి వరకు బస్తర్ రేంజ్‌లో వివిధ ఎన్‌కౌంటర్లలో 119 మంది నక్సలైట్లు హతమయ్యారు.
Read Also: Myanmar Earthquake: మయన్మార్ భూకంపం ‘‘334 అణు బాంబులకు’’ సమానం..
మరణించిన మహిళా మావోయిస్టు రేణుక అలియాస్ బాను, అలియాస్ చైతే, అలియాస్ సరస్వతిది ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామలోని కడివెండి గ్రామం. ఈమెపై మొత్తం రూ. 45 లక్షల రివార్డ్( ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రూ. 25 లక్షలు మరియు తెలంగాణ ప్రభుత్వం రూ. 20 లక్షలు) ఉంది. రేణుక సెంట్రల్ రీజినల్ బ్యూరో (CRB) ప్రెస్ టీం ఇన్‌చార్జ్, ఎడిటర్ ప్రభాత్ పత్రిక ప్రెస్ ఇంఛార్జుగా ఉన్నారు. ఎల్ఎల్‌బీ చదవిన రేణుక విప్లవానికి ఆకర్షితమై మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లారు.
రేణుక నేపథ్యం ఇదే..
1996లో నక్సల్స్ సంస్థలో చేరిన రేణుక అంచెలంచెలుగా బస్తర్ దండకారణ్యంలో కీలక మావోయిస్టుగా మారింది. 2006లో సౌత్ బస్తర్‌లో సీసీఎం దుల్లలా దాదా అలియాస్ ఆనంద్‌తో కలిసి పనిచేశారు. 2013 మాడ్ ప్రాంతానికి వచ్చి SZCM రామన్నతో కలిసి పనిచేశారు. 2020లో కరోనా కారణంగా రామన్న మరణించిన తర్వాత, DKSZCM సెంట్రల్ రీజినల్ బ్యూరో (CRB) ప్రెస్ టీం ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు. ఇది నక్సల్ సంస్థ తరపున ఈ పత్రికా ప్రకటనలను జారీ చేస్తుంది. ప్రభాత్, మహిళా మార్గం, అవామి జంగ్, పీపుల్స్ మార్చ్, పోడియారో పోల్లో, ఝంకార్, సంఘర్ష్టర్ మహిళా, పితురి, మిడంగూర్, భూమ్కల్ సందేశ్ వంటి వివిధ పత్రికలను ముద్రించి ప్రచురించేది.
ఈమె సోదరుడు SZCM GVK ప్రసాద్ అలియాస్ సుఖ్‌దేవ్ అలియాస్ గుడ్సా ఉసేండి 2014 సంవత్సరంలో తెలంగాణలో లొంగిపోయాడు. 2005లో సెంట్రల్ కమిటీ సభ్యుడు (CCM) శంకమురి అప్పారావు అలియాస్ రవితో వివాహం జరిగింది, అతను 2010 నల్లమల ఎన్ కౌంటర్ (ఆంధ్రప్రదేశ్)లో మరణించాడు.