Ajit Pawar: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని ఇతర రాష్ట్రాల్లో విస్తరించాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మహరాష్ట్రలో బలపడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల నాగ్ పూర్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇటీవల నాందేడ్, ఔరంగాబాద్ సభల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి విశేష స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీ విస్తరణపై అక్కడి పార్టీలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నాయి.
తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) కీలక నేత అజిత్ పవార్ మహారాష్ట్రలో సీఎం కేసీఆర్ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో తన పార్టీని విస్తరించాలని ప్రయత్నించినప్పటికీ.. రాష్ట్రంలో మాత్రం సఫలం కాలేరని ఆయన సోమవారం అన్నారు. పూణేలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. గతంలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు, మాయావతి, ములాయం సింగ్ యాదవ్‌లు ఇదే చేశారని అయితే విజయం సాధించలేదని అన్నారు.
Read Also: PM Modi US Visit: అమెరికా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోడీ..
‘‘ములాయం సింగ్ మరియు మాయావతి యుపి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వారు అదే పని చేయడానికి ప్రయత్నించారు, కానీ అతను కూడా పెద్దగా విజయం సాధించలేదు … బహుశా కె చంద్రశేఖర్ రావు జాతీయ స్థాయిలో నాయకుడు కావాలని కోరుకుంటాడు,అందుకే అతను ప్రయత్నిస్తున్నారు’’ అని అజిత్ పవార్ అన్నారు. కేసీఆర్ పార్టీలో చేరుతున్న వారికి ఇక్కడ అవకాశం రాదని తెలుసని ఆయన అన్నారు. మహారాష్ట్రలోని బీఆర్‌ఎస్ హోర్డింగ్‌లను ప్రస్తావిస్తూ ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ఉన్నప్పుడు బ్యానర్‌లు, ప్రకటనల కోసం డబ్బు ఖర్చు పెడుతున్నారని అన్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో రాష్ట్రప్రజలు ఆలోచించాలని అజిత్ పవార్ అన్నారు.
ఈ ఏడాది మార్చిలో సీఎం కేసీఆర్ మహారాష్ట్రలోని నాందేడ్ లో సభను నిర్వహించి, ప్రధాని మోడీతో పాటు, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, బీజేపీ, శివసేనలపై విమర్శలు గుప్పించారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణలో రైతులకు ఇచ్చిన విధంగా రైతుబంధు పథకాన్ని అమలు చేస్తామని ఆయన ప్రకటించారు.